తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ మరియు సీఐ ఆధ్వర్యంలో జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాలపై ప్రత్యేక నిఘా మరియు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ జీనత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లు, దుకాణదారులు మాత్రమే కాకుండా సంబంధిత కంపెనీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. దుకాణాలలో ఉన్న స్టాక్‌ను రోజువారీగా నమోదు చేయడంతో పాటు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు–అమ్మకాల బిల్లులు తనిఖీ సమయంలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. రికార్డుల్లో నమోదు చేసిన వివరాలు మరియు దుకాణంలో ఉన్న స్టాక్ మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదన్నారు. విత్తనాలను ఎంఆర్పీ ధరలకు మించి విక్రయించరాదని, రైతులు కొనుగోలు చేసిన ప్రతి విత్తనానికి సంబంధించి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. రైతులు కోరిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, గ్రామాల్లో తిరుగుతూ అనధికారికంగా విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని, నకిలీ విత్తనాల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో పటిష్ట నిఘా కొనసాగుతోందని, అనుమానం ఉన్న సందర్భాల్లో డీలర్ల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ