తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి రూపొందించిన ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, సుస్థిర వ్యవసాయ విధానాల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న “రైతు ముంగిట శాస్త్రవేత్తలు” కార్యక్రమం ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు జిల్లాలోని 23 మండలాల్లో నిర్వహించబడుతుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు నేరుగా గ్రామాలకు వెళ్లి రైతులకు ఆధునిక మరియు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు తక్కువ యూరియాను వాడి సాగు ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అవసరం మేరకే రసాయనాలను వినియోగించి ప్రకృతిని సంరక్షించడం, పంట మార్పిడిని పాటించడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని కొనసాగించడం వంటి అంశాలపై వివరంగా తెలియజేస్తారు. అదేవిధంగా మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలను సాగు చేసి అధిక ఆదాయం పొందడం, సాగునీటిని ఆదా చేసి భావితరాలకు వనరులను అందించడం, సేంద్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడం వంటి ముఖ్యమైన సూచనలు కూడా రైతులకు అందజేస్తారు రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని శాస్త్రవేత్తల సూచనలు అమలు చేస్తే మెరుగైన దిగుబడులు సాధించడంతో పాటు ఆర్థికంగా బలపడగలరని కలెక్టర్ అంకిత్ తెలిపారు . సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త భరత్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ