తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…. జనవరి 29 నుండి ఫిబ్రవరి 22 వరకు జరిగే ప్రాక్టికల్ పరీక్షలు మరియు మార్చి 5 నుంచి 25 వరకు జరిగే పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో 10173 మంది రెండవ సంవత్సరం 10,062 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలో 65 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు రెండు సెక్షన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, మెడికల్ శిబిరాలు, ఆర్టీసీ బస్ సౌకర్యాలు కల్పించాలని అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో 144 సెక్షన్ అమలు తప్పక ఉండాలని , కేంద్రాల దగ్గరలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని సూచించారు. ఏ ఒక్క కేంద్రంలో సెల్ ఫోన్ అనుమతించ వద్దని, పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు మానసిక వికాస తరగతులను నిర్వహించి వారిలో పరీక్షల పట్ల ఉన్న భయాందోళన తొలగించాలని అన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించి నూరు శాతం ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సిహెచ్. వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఏ ఆర్ డి ఎస్ పి సత్యనారాయణ ,టేకులపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి , ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ అరవింద్ బాబు, జిల్లా అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ