తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సెన్సస్‌కు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.తెలంగాణ రాష్ట్రంలో సెన్సస్–2027 ఏర్పాట్లపై డీసీఓ భారతి హోళీకేరి సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక చార్జ్‌లకు సంబంధించిన ప్రతిపాదనలు అన్ని జిల్లాలు సమర్పించాల్సి ఉండగా, కొన్ని జిల్లాలు మాత్రమే వివరాలు అందించాయని, మిగతా జిల్లాలు వెంటనే సమర్పించాలని ఆదేశించారు.ఇళ్ల గణనకు సంబంధించి జిల్లా, మండల స్థాయిలో భూభాగ గణాంకాల్లో ఉన్న వ్యత్యాసాలపై కూడా చర్చించారు. వివిధ వనరుల నుండి వచ్చిన డేటాలో ఒకే డేటాను ఖరారు చేసి, జిల్లా సెన్సస్ అధికారి ద్వారా ధృవీకరించి పంపించాలని సూచించారు. ఇతర మార్గాల ద్వారా పంపిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.ఎన్యూమరేటర్ల మాన్యువల్స్, సూపర్వైజర్ కిట్స్, మ్యాప్స్ వంటి సెన్సస్ సామగ్రి పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. చార్జ్ అధికారులకు నేరుగా పంపబడే ఈ సామగ్రిని స్వీకరించి, పరిమాణాన్ని ధృవీకరించాలని సూచించారు. అలాగే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసి, వంద శాతం లక్ష్యంతో పాటు అదనపు రిజర్వ్ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.సెన్సస్–2027 కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని డీసీఓ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఐడీఓసీ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో సెన్సస్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే విస్తృత స్థాయిలో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సెన్సస్‌కు సంబంధించిన ప్రతి దశను సమయపాలనతో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత శాఖల మధ్య సమన్వయం కల్పిస్తూ పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు.ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసి, వారికి సమగ్ర శిక్షణ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫీల్డ్ స్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తుగా పర్యవేక్షణ చేపడుతున్నామని, అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు .సెన్సస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని, డేటా ఖచ్చితత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు.ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ