తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : పోడు రైతులకు పెండింగ్ పట్టాలు ఇవ్వాలి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి నకిలీ విత్తన దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఏఐకెఎస్ జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్ ప్రస్తుత వానాకాలం సీజన్ ప్రారంభమైనందున అర్హులైన ప్రతి రైతు ఖాతాలో 'రైతు భరోసా' పెట్టుబడి సాయం నిధులను ఆలస్యం చేయకుండా తక్షణమే జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకెఎస్) జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, సిపిఐ చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండల కార్యదర్శులు వాసిరెడ్డి మురళి, దీటి లక్ష్మీపతి డిమాండ్ చేశారు. వివిధ రైతు సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఏఐకెఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి, అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేర్వేరుగా జరిగిన ధర్నా కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ.. జిల్లాలో సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర పోడు రైతులకు పెండింగ్‌లో ఉన్న పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలని, పట్టాలు పొందిన రైతులకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేసి రుణ అర్హత కల్పించాలన్నారు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక లోపాల వల్ల వందలాది మంది రైతుల భూములు పార్ట్-బి లోనో, లేదా ఇతరుల పేర్ల మీదో తప్పుగా నమోదయ్యాయని, ఈ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక చొరవతో, త్వరితగతిన పరిష్కరించి రైతులకు హక్కులు కల్పించాలని కోరారు. గతంలో ప్రకటించిన పంట రుణమాఫీ పథకం సాంకేతిక కారణాల వల్ల మండలంలో చాలా మంది రైతులకు వర్తించలేదని, అర్హత ఉండి ఉమ్మడి ఖాతాలు, రేషన్ కార్డ్ లింకేజ్ సమస్యల వల్ల ఆగిపోయిన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలన్నారు. ప్రస్తుత సాగు సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను ముంచుతున్న దళారులు, ప్రైవేట్ వ్యాపారులపై వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, గెడ్డాడు నగేష్, నేరెళ్ల రమేష్, నాగయ్య, శాపావత్ రవి, రామారావు, ఎర్రబెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ