తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అధికారులు అలసత్వం వీడి పనులు ముమ్మరం చేయాలి గోదావరి జలాలతో ఉభయ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన సత్తుపల్లి ట్రంక్ కాలువ పనులను వేగవంతం చేసి రాబోయే వర్షాకాలానికి సత్తుపల్లి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గంలోని యతలకుంటలో ఉమ్మడి జిల్లా అధికారులతో కలిసి, అశ్వరావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టి పంపు నుంచి యతలకుంట వరకు సాగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జులు, రోడ్డు క్రాసింగ్లు, కాలువ పనుల అమలులో ఉన్న లోపాలు, సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేసి, ఎక్కడా నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా పర్యవేక్షణను మరింత పెంచాలని సూచించారు అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారులు అలసత్వాన్ని విడిచిపెట్టి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సత్తుపల్లి ట్రంక్ కాలువ ద్వారా సుమారు 43 కిలోమీటర్ల పొడవున 1.46 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. మొత్తం రూ.700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు సుమారు రూ.600 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని తెలిపారు.
రాజీవ్ కాలువ స్టెబిలైజేషన్ ద్వారా ఇప్పటికే సుమారు 1.35 లక్షల ఎకరాలకు నీరు అందించామని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం నాగార్జునసాగర్ జలాలు అందకపోయినా వైరా ఆయకట్టు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాలకు గోదావరి జలాలను మళ్లించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా సత్తుపల్లి ట్రంక్ కాలువ ద్వారా వేంసూరు, దమ్మపేట మండలాలకు కూడా నీరు అందించే అవకాశముందని అన్నారు . నాలుగో పంప్ హౌస్ పనులు పూర్తి అయితే వచ్చే సంవత్సరం అశ్వరావుపేట, దమ్మపేట మండలాలకు గోదావరి జలాలు అందించవచ్చని తెలిపారు. దీంతో మొత్తం 110 కిలోమీటర్ల మేర కాలువ వ్యవస్థ పూర్తవుతుందని, మెయిన్ కాలువతో పాటు మూడు పంప్ హౌస్‌లను వినియోగించి గోదావరి జలాలను ఉభయ జిల్లాల్లోని 8 నియోజకవర్గాలకు సరఫరా చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. పాలేరు ప్రాంతానికి గోదావరి జలాలు చేరాలంటే జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉభయ జిల్లాల్లోని మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీరు అందించడమే కాకుండా మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేసి పినపాక నియోజకవర్గంలో 16,500 ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేస్తేనే ప్రాజెక్ట్‌ను నిర్దేశిత కాలంలో పూర్తి చేసి ఉభయ జిల్లాలను సస్యశ్యామలంగా మార్చగలమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు,ఉభయ జిల్లాల ఇంజనీరింగ్ ఇరిగేషన్ పోలీస్ ఫారెస్ట్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ