తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేల పరీక్షలతోనే లాభదాయకమైన సాగు సాధ్యం.శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తేనే రైతులకు అధిక దిగుబడి, ఆదాయం.అవసరానికి మించి రసాయనాలు వాడి భూమి ఆరోగ్యాన్ని దెబ్బతీయొద్దు.మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలనే వేయాలి.యువత వ్యవసాయ రంగంపై ఆసక్తి పెంచుకుని దేశానికి వెన్నుముకగా నిలవాలి. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. నేల పరీక్షలతోనే లాభదాయకమైన సాగు సాధ్యమవుతుందని, ప్రతి రైతు తన భూమి స్వభావాన్ని తెలుసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా చుంచుపల్లి మండల పరిధిలోని ఎస్‌సీబీ నగర్ రైతు వేదికలో సోమవారం నిర్వహించిన "రైతు మహోత్సవం - రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాస్త్రవేత్తలతో చర్చించి భూమిలోని ఖనిజాల స్థితి, పీహెచ్ విలువలు, నేల స్వభావం వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన రైతు ఉద్దేశించి మాట్లాడుతూ... మనిషికి రక్తపరీక్షలు ఎంత అవసరమో, భూమికి కూడా పరీక్షలు చేసి దాని ఆరోగ్యాన్ని కాపాడటం అంతే ముఖ్యమని వివరించారు. భూమికి అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుంటేనే రైతులకు కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందన్నారు. సాగు ఖర్చులను తగ్గించుకోవాలని, ముఖ్యంగా అవసరానికి మించి యూరియా, ఇతర రసాయనాల వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు. మార్కెట్‌లో ఏ పంటకు డిమాండ్ ఉందో గమనించి అవే పంటలు సాగు చేయాలని, సాగునీటిని ఆదా చేస్తూ భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా ప్రకృతిని కాపాడుతూ నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించవచ్చని తెలిపారు. ఏడు రోజుల పాటు సాగే ఈ అవగాహన కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత మరింత పెరుగుతుందని, రైతుల పిల్లలు కూడా ఈ వృత్తిపై మక్కువ పెంచుకుని ఆధునిక పద్ధతులతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. శాస్త్రం తోడైతేనే రైతు భవిష్యత్తు బలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గణేష్ చౌహన్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితా కుమారి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ