తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రభుత్వ కార్యక్రమము అనుసరించి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలో గ్రామసభల నిర్వహణ – ప్రజలకు శాఖల ప్రగతి నివేదికల వివరణ, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన జూలూరుపాడు మండలంలోని గ్రామ పంచాయతీలలో ఈరోజు గ్రామసభలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామసభలకు జిల్లా స్థాయి మరియు మండల స్థాయి అధికారులు హాజరై ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకర్ల గ్రామపంచాయతీ గ్రామ సభకు డిప్యూటీ కమిషనర్, పంచాయతీరాజ్ & రూరల్ ఎంప్లాయ్‌మెంట్ శాఖ శ్రీమతి విద్యాలత , జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీమతి నాగలక్ష్మి , ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి జిల్లా పరిషత్ శ్రీ అప్పారావు , డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ ప్రభాకర్ , మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి, ఎంపీ ఓ తులసీరామ్ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామసభలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను చదివి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామస్థుల బాధ్యతలు, ప్రజా భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛత మరియు పర్యావరణ పరిరక్షణ అంశాలపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీమతి నాగలక్ష్మి ప్రత్యేక వీడియో ప్రదర్శించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం గ్రామ ప్రజలందరితో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీమతి విద్యాలత మాట్లాడుతూ, పంచాయతీరాజ్ వ్యవస్థలో వివిధ శాఖల సమన్వయం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయం అన్ని శాఖల కార్యక్రమాల సమన్వయ బాధ్యతను నిర్వహిస్తున్నందున, మండల స్థాయి అధికారులు పరస్పర సహకారంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని సూచించారు. గ్రామసభల ద్వారా ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ