తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పనులు వేగవంతం చేయాలి – అధికారులకు ఆదేశాలు. కొత్తగూడెంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. కొత్తగూడెంలో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం కేటాయించిన స్థలంలో జరుగుతున్న పనులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో జరుగుతున్న లెవెలింగ్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ ద్వారా భవనాల రూపకల్పన, విభాగాల వారీగా ఏర్పాటు చేయనున్న సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందించనున్న తరగతి గదులు, లైబ్రరీలు, బ్లాక్ రహదారులు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై వివరాలు తెలుసుకున్నారు... నిర్మాణ పనులు నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి అయ్యేలా వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బంది, యంత్ర సామగ్రి ఏర్పాటు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పనుల నాణ్యతపై ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అత్యుత్తమ సౌకర్యాలతో పాఠశాల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ