తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గర్భిణులతో వంటల కార్యక్రమం, తల్లులతో ప్రతిజ్ఞ: పోషకాలపై అవగాహన కల్పించిన సూపర్‌వైజర్ పార్వతి రామవరం సెక్టార్ పరిధిలోని చిట్టి రామవరం అంగన్‌వాడీ కేంద్రంలో 99వ రోజుల "ప్రజా పాలన ప్రణాళిక" మహిళా వారోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామవరం సెక్టార్ సూపర్‌వైజర్ శ్రీమతి పార్వతి మేడం గారు హాజరయ్యారు. మహిళా వారోత్సవాల సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలతో కలిసి ప్రత్యేకంగా వంటల కార్యక్రమాన్ని (కుకింగ్ ప్రోగ్రామ్) నిర్వహించారు. గర్భధారణ సమయంలో ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో ప్రత్యక్షంగా వివరించడానికే ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ పార్వతి గారు మాట్లాడుతూ... గర్భిణులు, బాలింతలు మరియు చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దైనందిన జీవితంలో స్థానికంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు మరియు పోషకాలతో కూడిన ఆహారాన్ని భాగం చేసుకోవాలని ఆమె తల్లులకు అవగాహన కల్పించారు. అనంతరం కేంద్రానికి వచ్చిన తల్లులందరితో పిల్లల ఆరోగ్యం, సంరక్షణ మరియు సరైన పోషణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రామవరం సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, గర్భిణులు, బాలింతలు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ