తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రహదారి ప్రమాదాల నియంత్రణకు సమన్వయంతో చర్యలు – డీజీపీ శివధర్ రెడ్డి.హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, డీజీపీ శివధర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని 13-04-2026 నుండి 18-04-2026 వరకు నిర్వహించడంపై సమీక్షించారు.ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ రవాణా శాఖ, హోం శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. దేశంలో రహదారి ప్రమాదాలు అధికంగా ఉండటం వల్ల చెడు పేరు వస్తోందని, రాష్ట్రంలో రోజుకు సుమారు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రత అనేది ప్రమాదాల నివారణలో కీలకమని పేర్కొన్నారు. గత సంవత్సరం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రమాదాలు కొంత మేర తగ్గినట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు.కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం:13-04-2026న గ్రామస్థాయిలో రహదారి భద్రతపై గ్రామసభలు నిర్వహించి, రహదారి భద్రత కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి కమిటీలో 8 నుండి 9 మంది సభ్యులు ఉండి, అందులో కనీసం ముగ్గురు మహిళలు ఉండాలని సూచించారు. రహదారుల సమస్యలు, ప్రమాదాలకు కారణాలు చర్చించి, భద్రత ప్రతిజ్ఞ చేయించాలని పేర్కొన్నారు.14-04-2026న అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఎన్జీవోలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి వాటి కారణాలను విశ్లేషించి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. కనీసం కొన్ని బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిని ప్రమాదరహితంగా మార్చాలని అన్నారు.15-04-2026న చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించి, పాఠశాలల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై బోర్డులు ఏర్పాటు చేయాలని, సురక్షిత బస్సు ప్రయాణంపై పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కాలనీలు, కమ్యూనిటీ హాళ్లలో అవగాహన సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.16-04-2026న సోషల్ మీడియా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ ఉద్యోగులు రహదారి భద్రతలో ఆదర్శంగా నిలవాలని తెలిపారు. డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, ఆటో, లారీ, బస్సు డ్రైవర్ల లైసెన్సులు, పత్రాల తనిఖీలు చేపట్టాలని సూచించారు.17-04-2026న గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించి, పోలీసు, అంబులెన్స్ సిబ్బందికి ప్రథమ చికిత్స, బాధితుల సంరక్షణ, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. అత్యవసర కాల్స్ (100/112) వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు.18-04-2026న ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కౌన్సెలింగ్ నిర్వహించి, వేగ పరిమితి బోర్డులు, లేన్ క్రమశిక్షణ, రహదారి సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పాఠశాల బస్సుల భద్రత తనిఖీలు, డ్రైవర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పాఠశాలల వద్ద సురక్షిత జోన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 38 బ్లాక్ స్పాట్లను ప్రమాదరహితంగా మార్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామసభలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్థానికంగా చర్యలు చేపట్టాలని సూచించారు. మండల, మున్సిపల్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి పూర్తి కార్యాచరణ సిద్ధం చేయాలని తెలిపారు.రహదారి భద్రతపై వినూత్న కార్యక్రమాలు చేపట్టి, కళాజాత బృందాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. రాత్రివేళ రహదారులపై జంతువుల సంచారం వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు పశుసంవర్ధక శాఖతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అధిక ఎల్ఈడి లైట్ల వినియోగం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నందున వాటిపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని, రహదారుల వెంట ఉన్న అక్రమ ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, పిల్లలు, తల్లిదండ్రులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. రహదారి భద్రత వారంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలని తెలిపారు.ఆటో, లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు వైద్య శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని, ఆర్టీసీ ద్వారా కూడా డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి రేపు సాయంత్రం నాటికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, జిల్లాలో రహదారి భద్రతను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని పోలీసు శాఖ అన్ని విభాగాలతో సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలైన అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం లోపించడం వంటి అంశాలపై ప్రత్యేక డ్రైవులు నిర్వహిస్తామని చెప్పారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, రవాణా శాఖ అధికారి వెంకటరమణ, వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, డిపిఓ సుధీర్, ఆర్ అండ్ బి ఈ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్లు, డి సి హెచ్ ఓ రవిబాబు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ