తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించటం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ హాజరయ్యారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోటి మంది బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా బీసీ నాయకులతో ప్రారంభించారు.. తదనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో దాసు సురేశ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాజ్యాంగంలో మనం రాసుకున్న సామాజిక న్యాయ సాధన కోసం, సమానత్వం కోసం బీసీ రాజ్యాధికార సమితి కృషి చేస్తుందన్నారు.. ఈ దిశగా బీసీల నాయకత్వ నిర్మాణాన్ని క్షేత్ర స్థాయిలో చేపడుతూ ఇప్పటికే 27 జిల్లాలలో కమిటీలను పూర్తి చేశామన్నారు.. బీసీలను బలమైన సంఘటిత శక్తిగా మార్చడానికి కోటి సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.. బీసీలను రాష్ట్రంలో , దేశంలో బలమైన రాజకీయ శక్తిగా మార్చడమే తమ అంతిమ లక్ష్యమనీ అందుకోసం బీసీలు బలంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలోనే పూర్తిస్థాయి నియోజకవర్గ , పట్టణ , డివిజన్ , మండల, గ్రామ స్థాయిలో కమిటీలను పూర్తి చేస్తామన్నారు..
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉటంకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తమ మేనిఫెస్టోలో పేర్కొన్నదని స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తామన్న ప్రధాన హామీతోనే కాంగ్రెస్ ను గద్దెనెక్కించాం అని గుర్తుచేశారు.42 శాతం రిజర్వేషన్ హామీని అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుండి 18 శాతానికి తగ్గించడం వల్లనే బీసీల ఆగ్రహానికి గురయ్యి కేసీఆర్ ప్రభుత్వం పతనమయ్యింది అని గుర్తుచేశారు.బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ జీవో ఇవ్వకుండా రాజకీయ లబ్ది కోసం మెలిక పెట్టి ముందుకెళితే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీకి పట్టిన పరిస్థితే ఎదురవుతుందని గుర్తుచేశారు. గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు కేవలం 18%కి తగ్గించబడ్డాయన్నారు. 12,750 గ్రామ పంచాయతీలలో బీసీలకు కేవలం 2,345 స్థానాలే ఇవ్వబడ్డాయనీ మండిపడ్డారు..ఈ అన్యాయానికి వ్యతిరేకంగా తాము అనేక ఉద్యమాలు చేశామనీ , ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపామని గుర్తుచేశారు . తద్వారానే రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీలు కూడా బీసీ కులగణనపై మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ ఇది వారి గొప్పతనం కాదనీ తమ పోరాట ఫలితమేనని తేల్చి చెప్పారు..
మంత్రుల శాఖల పంపిణీలో సహితం బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని దాసు సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు .. ప్రాధాన్యత , అధిక మొత్తంలో బడ్జెట్ ఉన్న శాఖలను అగ్రవర్ణాలకు కట్టబెట్టి ప్రాధాన్యత లేని శాఖలను బీసీ ఎస్సీ ఎస్టీ లకు అప్పజెప్పడం ఏ మేరకు సమంజసం అన్నారు.. రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిర్వచించే సామాజిక న్యాయం ఇదేనా అని ప్రశ్నించారు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పక అమలుచేయకపోతే బీసీ సమాజం తీవ్రమైన పోరాటానికి సిద్ధమవుతుందని తెలిపారు . కేంద్రం కావచ్చు – రాష్ట్రం కావచ్చు, బీసీల హక్కులకు జీవో జారీ చేయకపోతే, వాటి ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రంలో బీసీ ఉద్యమం మరింత తీవ్రతరమవుతుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి వీరేందర్ గౌడ్, రాష్ట్ర ఎన్నికల కన్వీనర్ రాచర్ల రాములు, రాష్ట్ర నాయకులు సట్ల ప్రభాకర్, రాష్ట్ర యువ నాయకులు సాయి కిరణ్ పొడకంటి, స్థానిక జిల్లా నాయకులు మల్లెల రామనాధం, బొలిశెట్టి రంగారావు, కురిమెళ్ళి శంకర్, గౌని నాగేశ్వర్ రావు, కొదురుపాక మీనాక్షి, నరసింహ చారి, మల్లు బాబు యాదవ్, నాగేశ్వర్, కోపనాతి శాంత రావు, కళ్యాణ్ చక్రవర్తి, బుర్ర సోమేశ్వర గౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ