తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నక్ష పైలట్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు భూముల రీ-సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు (నక్ష) కార్యక్రమాల పురోగతిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్రంలో వివాదాలు లేని పారదర్శక భూపరిపాలన వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం డిజిటల్ సర్వే కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నక్ష పైలట్ ప్రాజెక్టులకు ఎంపికైన జిల్లాల్లో సర్వే మరియు రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో రోవర్ పరికరాల ద్వారా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఆస్తులకు ఖచ్చితమైన సర్వే చేపట్టి, రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నక్ష పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని మణుగూరు మున్సిపాలిటీ ఎంపికైందని తెలిపారు. ప్రాజెక్టు అమలులో భాగంగా సర్వే మరియు రెవెన్యూ శాఖల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ శాఖ ద్వారా ఆర్ఓఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని వివరించారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 రెవెన్యూ వార్డులు ఉండగా, వాటిని 97 బ్లాక్‌లుగా విభజించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతంలో సుమారు 7,524 ఆస్తులను గుర్తించడం జరిగిందని, వాటిలో 5064 ఆస్తుల సర్వే పూర్తయిందని చెప్పారు. అలాగే 2,074 ఆస్తులకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. నక్ష ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు పారదర్శకమైన భూ రికార్డులను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పనిచేస్తున్నాయి అని తెలిపారు . ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఏడి సర్వే శ్రీనివాస్,మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ