తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనాభా గణన–2027 కార్యక్రమాన్ని జిల్లాలో ఎటువంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. జనగణనలో భాగంగా మొదటి దశ అయిన గృహాల జాబితా మరియు గృహ వసతుల గణనపై జిల్లా ఛార్జ్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తో కలిసి ఆదివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 15, 16, 17 తేదీలలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో అధికారులు జనగణన డేటా సేకరణ విధానంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లాలో జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. జనగణన ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహిస్తూ డేటా సేకరణ సమయంలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.జనగణన ప్రక్రియను పారదర్శకంగా, లోపరహితంగా పూర్తి చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శిక్షణ కార్యక్రమంలో జనగణనపై డిజిటల్ విధానంలో అవగాహన కల్పించేందుకు జనగణన విభాగం అధికారులు, ట్రైనర్లు సాఫ్ట్‌వేర్ ద్వారా వివరాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జనగణన ద్వారా సేకరించే గణాంకాలు గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది వంటివని కలెక్టర్ తెలిపారు . పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల కల్పనకు, అలాగే సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరవేయడానికి ఖచ్చితమైన గణాంకాలు అత్యంత అవసరమని తెలిపారు.ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా సేకరించబడతాయని తెలిపారు. పౌరులు తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ, రెండో దశలో జనాభా వివరాల సేకరణ జరుగుతాయని వివరించారు.ప్రతి ఎన్యూమరేటర్ తనకు కేటాయించిన లాగిన్ వివరాలతో యాప్‌ను సక్రమంగా వినియోగించడం, డేటా ఎంట్రీ చేయడం, సర్వర్‌కు లింక్ చేయడం వంటి అంశాల్లో నైపుణ్యం సాధించాలని కలెక్టర్ సూచించారు. వయస్సు, విద్యార్హత, వృత్తి, సామాజిక వర్గం, మౌలిక వసతుల వివరాలు వంటి అంశాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఖచ్చితమైన సమాచారం మాత్రమే నమోదు చేయాలని అన్నారు. గృహ నిర్మాణం, నీటి వనరు, మరుగుదొడ్డి, విద్యుత్, వంట ఇంధనం, ఇంటర్నెట్ సౌకర్యం వంటి 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, జెడ్పిసిఈఓ నాగలక్ష్మి కొత్తగూడెం ఆర్డీవో మధు, ఉదయ భాస్కర్ గణాంక అధికారి,ఈడియం సైదేశ్వర రావు, మాస్టర్ ట్రైనర్లు,తాసిల్దార్లు ఎంపీడీవోలు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ