తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రవ్యాప్తంగా చేపల ఉత్పత్తి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో సోమవారం హైదరాబాద్ నుండి మత్స్యశాఖ ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్, డైరెక్టర్ నిఖిలతో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకాటి శ్రీహరి అన్ని జిల్లాల కలెక్టర్లు, మత్స్యశాఖ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించామని, ఇందుకోసం రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించామని తెలిపారు. ఇప్పటికే చేప పిల్లల కొనుగోలు టెండర్ ప్రక్రియ పూర్తయిన జిల్లాల్లో చెరువుల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మాంసాహారంలో చేపలు తినే వారి సంఖ్య పెరగాలంటే ప్రజలకు చేపల ప్రోటీన్ విలువ, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. జూరాల వంటి జలాశయాల వద్ద చేపల స్టాల్స్, ఐస్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఆక్వా కల్చర్ అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. చేప పిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటలు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెరువులు, జలాశయాల్లో చేప పిల్లలను సకాలంలో వదులుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో చేప పిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైందని, మిగిలిన చెరువుల్లో నీటి లభ్యతను పరిశీలించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని చేప పిల్లల వదలికకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. చేపల పెంపకాన్ని పర్యవేక్షించేందుకు మరియు లబ్ధిదారుల వివరాలను నమోదు చేసేందుకు “టీ మత్స్య మొబైల్ యాప్” పై ఇప్పటికే అవగాహన కల్పించామని, ప్రతి లబ్ధిదారు ఇందులో తమ వివరాలను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సమీక్షా సమావేశంలో జిల్లా మత్స్యశాఖ ఏడి ఇంతియాజ్ ఖాన్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ