తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వరదలు, పరిశ్రమ ప్రమాదాల నియంత్రణపై ఎన్‌డిఎంఏ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.వరదలు, పరిశ్రమలలో సంభవించే ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధించి జిల్లాల్లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మాక్ ఎక్సర్సైజ్‌లు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఏ) ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, ఎన్‌డిఎంఏ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులకు వరదలు, పరిశ్రమ ప్రమాదాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వీడియో అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మలతో కలిసి ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మరియు ఎన్‌డిఎంఏ అధికారులు మాట్లాడుతూ, జిల్లాలలో వరదలు లేదా పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు అధికార యంత్రాంగం వేగంగా, సమన్వయంతో స్పందించేందుకు ముందస్తు సిద్ధత ఎంతో అవసరమని తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో విపత్తుల నిర్వహణకు సంబంధించిన మాక్ ఎక్సర్సైజ్‌లు నిర్వహించి, అందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే సమీక్షించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు మాట్లాడుతూ , ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా తక్కువ సమయంలో భారీ వర్షాలు కురిసి ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయని, వీటి వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వరదల సమయంలో ప్రజలకు సకాలంలో సహాయం, పునరావాసం, పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా సిద్ధంగా ఉండాలని తెలిపారు. అలాగే పరిశ్రమ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు పాటించాల్సిన ప్రామాణిక విధానాలపై (ఎస్.ఓ.పి.) స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి పరిశ్రమలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ , గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు జిల్లాలో చేపడుతున్న ముందస్తు మరియు తక్షణ చర్యలను వివరించారు. వరదల అంచనాల విధానం, ముందస్తు హెచ్చరికల జారీ, కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, పునరావాస కేంద్రాల నిర్వహణ, లోతట్టు ప్రాంతాలలో శాశ్వత పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ అధికారులకు వివరించారు.అనంతరం కలెక్టర్ అధికారులకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సూచనలు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వరదలు, పరిశ్రమలలో సంభవించే భారీ ప్రమాదాల సమయంలో అధికార యంత్రాంగం సమన్వయంతో స్పందించేలా మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, మిషన్ భగీరథ ఈఈ నలిని, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, ఇరిగేషన్ ఈజీ అర్జున్ రావు, ఆర్ అండ్ బి శాఖ ఈఈ నాగేశ్వరరావు, డి సెక్షన్ సూపర్డెంట్ వెంకటేశ్వర్లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ