తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమావేశమై ఈ నెల 12వ తేదీన ప్రజా ప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడిందని తెలిపారు. ఈ కార్యాచరణను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్యం, అరైవ్ అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, వ్యవసాయం, విద్య, యువత, మహిళలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం జరుగుతుందని వివరించారుఈ నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు జిల్లా కేంద్రాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో ప్రజా ప్రతినిధులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, పాత్రపై అవగాహన కల్పించాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు చేరవేయడంలో ప్రజా ప్రతినిధులు తీసుకోవాల్సిన చర్యలపై కూడా వారికి స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాలపై కూడా ప్రజా ప్రతినిధులకు సంక్షిప్తంగా వివరించాలని పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్ల సహాయంతో సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుకు శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలు, పట్టణ ప్రాంతాలలో పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ–ఆఫీస్ విధానంలో పెండింగ్ ఫైళ్లను వేగవంతంగా క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను దశల వారీగా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డిపిఓ సుధీర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, మున్సిపల్ కమిషనర్లు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ