తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరేలా సకల సదుపాయాలు కల్పిస్తున్నాం - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మణుగూరు మండలం లంక మల్లారం గ్రామంలో గురువారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసి, టీటీఆర్‌జేసీ బాలికల డార్మెటరీ హాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకటరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా రూ.1 కోటి అంచనా వ్యయంతో ప్రధాన బీటీ రహదారి నుండి పాఠశాల వరకు అప్రోచ్ బీటీ రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇటీవలే రూ.2 కోట్లు 70 లక్షల వ్యయంతో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. పేదవారి పిల్లలు కూడా ధనికుల పిల్లలతో సమానంగా చదువుకోవాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వ పాఠశాలలు మరియు రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విద్య పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు అనేక నిదర్శనాలు ఉన్నాయని వివరించారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా మంచి ఆహారం తీసుకుంటూ, మెరుగైన విద్యను అభ్యసించాలనే ఆశయంతో ప్రభుత్వం హాస్టళ్లలో ఉన్న బాలబాలికలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తోందన్నారు. ఇంటి వద్ద తల్లులు చేసే వంటల రుచిని గుర్తు చేసేలా పోషకాహారంతో కూడిన మెనూను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి రోజూ అందించే ఆహారం విషయమై స్పష్టమైన ప్రణాళికతో హాస్టళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్తుపై పూర్తి విశ్వాసంతో ఉందని, వారు తమ కాళ్ల మీద నిలబడి దేశాన్ని, ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగగలరని నమ్ముతున్నామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరికీ చదువు ఆగిపోకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. పేదవారి పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను పొందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.65 కోట్ల వ్యయంతో ఏ టీ సి కేంద్రాల ద్వారా వివిధ నైపుణ్యాలపై శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎలక్ట్రిషియన్, మెకానిక్ వంటి రంగాల్లో విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణల ద్వారా వారు స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వైద్య రంగంలో కూడా పేదవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. పేదల పక్షపాతిగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని వివరించారు.ప్రభుత్వం మీ కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదో తరగతి మరియు ఇంటర్మీడియట్‌లో శాతం వంద ఫలితాలు సాధించినందుకు ప్రిన్సిపాల్ మరియు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వ తరఫున హృదయపూర్వకంగా అభినందించారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ , ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తోందన్నారు. పినపాక నియోజకవర్గంలో కూడా ఈ పాఠశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు గిరిజన అభివృద్ధి కోసం అదనంగా 1000 ఇళ్లు మంజూరు చేసి, నియోజకవర్గంలోని 380 గ్రామాలకు సుమారు 4500 ఇళ్లు ఆమోదించామని వివరించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని, “అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ” ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకటరావు మాట్లాడుతూ , ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ డైట్ ఛార్జీలు పెంచి పోషకాహారం అందిస్తున్నదన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించబడుతున్నాయని, ఈ అవకాశాలను వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ”లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ వంటి వసతులను పూర్తి స్థాయిలో కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వేసవి సెలవుల్లో సమ్మర్ క్లాసులు నిర్వహించి విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో శిక్షణ అందించనున్నామని తెలిపారు. పేరెంట్స్ మీటింగ్స్ ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన పెంచుతూ, విద్యార్థుల డ్రాప్‌ఔట్ రేటును తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ మాట్లాడుతూ, ఈ విద్యాసంస్థలో ప్రస్తుతం 584 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. 16 గదులతో నిర్మించిన కొత్త డార్మెటరీ ద్వారా సుమారు 600 మందికి వసతి కల్పించగల సామర్థ్యం ఏర్పడిందన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉందని, ఐఐటీ తదితర ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గిరిజన గురుకుల విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం రూ.53 కోట్లు మంజూరు చేయగా, భద్రాచలం ఐటీడీఏకు రూ.6 కోట్లు, ఈ పాఠశాలకు రూ.25 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గిరిజన పాఠశాలల్లో కూడా డిజిటల్ తరగతులు నిర్వహించేలా తగిన సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి ని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ పూనెం రమేష్,పాఠశాల ప్రిన్సిపాల్ రాణి, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ