తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శతాబ్ద కాలానికి పైబడిన చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ సంస్థ కొత్తగూడెం 7 షాఫ్ట్‌లో బొగ్గు తవ్వకాల ప్రారంభ దశలోనే, అక్కడి ఎత్తుగడ్డపై ఉన్న భారీ రాతిపై చెక్కబడిన హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించబడింది. అప్పటి నుండి ఈ విగ్రహం “అభయ ఆంజనేయ స్వామి”గా భక్తుల పూజలను అందుకుంటూ, వారికి ధైర్యం, భక్తి నింపుతోంది. కాలక్రమేణా ఓపెన్‌కాస్ట్ పనులు ప్రారంభమవడంతో, ఆ ప్రాంతంలోని జనవాసాలు తొలగించబడగా, భక్తుల రాకపోకలు తగ్గాయి. అయినప్పటికీ, ప్రతి మంగళవారం భక్తులు హనుమాన్ చాలీసా పఠనం చేస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల, ఓపెన్‌కాస్ట్ విస్తరణలో భాగంగా ఆ గుట్టను కూడా తొలగించాలని సింగరేణి యంత్రాంగం నిర్ణయించడంతో, భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయంలోని విగ్రహానికి ఎలాంటి నష్టం కలగకుండా, మరొక అనుకూల ప్రాంతానికి మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. భక్తుల్లో ఆందోళన శతాబ్ద కాల చరిత్ర కలిగిన ఈ హనుమాన్ విగ్రహం తరలింపు నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భక్తుల భావోద్వేగాలకు ఎంతో దగ్గరైన ఈ దేవాలయాన్ని యథాతథంగా పరిరక్షించాలని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, విగ్రహాన్ని సురక్షితంగా తరలించి, సరైన ప్రాంతంలో కొత్తగా ఆలయం నిర్మించేందుకు పూర్తి సహకారం అందిస్తే, మార్పిడికి భక్తులు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ