తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాలో అద్భుత ఫలితాలు సాధించవచ్చు అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. టీఎన్జీవో, టీజీవో, ట్రస్మా ఆధ్వర్యంలో పాల్వంచ లోని ఓ గార్డెన్ లో ఆదివారం నిర్వహించిన 'ప్రగతి టుగెదర్' కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాధించిన ప్రగతికి సంబంధించిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. జిల్లా అభివృద్ధికి కావలసిన వనరులు పుష్కలంగా ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకోవడంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మునగ, అజోల్ల, సమీకృత వ్యవసాయం, కొర్రమీను, కంజు పిట్టల పెంపకం, బయోచార్, ఇటుకల తయారీ వంటి వాటిల్లో మెరుగైన ఫలితాలు సాధించామని అన్నారు. వీటిపై మరింత దృష్టి సారిస్తే జిల్లా రైతాంగం ఆర్థికంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ. .. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికే గిరిజన విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేందుకు కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాం విజయవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. గిరిజన మ్యూజియాన్ని ఆధునికరించి సందర్శకుల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డిఓ మధు, జిల్లా పరిషత్ సీఈవో నాగలక్ష్మి వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ