తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కీలక పరీక్షలుగా, పకడ్బందీగా, పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడతాయి కాబట్టి, అన్ని కేంద్రాల్లో కంప్యూటర్లు, సాంకేతిక సదుపాయాలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్ బ్యాకప్ మొదలైన ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం చేయబడ్డాయి అని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రతి కేంద్రంలో టెక్నికల్ సిబ్బందిను నియమించామని కలెక్టర్ తెలిపారు.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని, పరీక్ష సమయానికి పది నిమిషాలు ముందుగా గేట్లు మూసివేయబడతాయని అనంతరం ఎవరిని అనుమతించబోరని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఫోటో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి మొదలైనవి) తీసుకురావాలి అని నిషితంగా పరిశీలించిన అనంతమే పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పూర్తిగా నిషేధించబడ్డాయని, అభ్యర్థులు తమ వెంట తీసుకువచ్చే వ్యక్తిగత సామాగ్రికి తాము పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష విధానాన్ని ముందుగానే తెలుసుకోవాలి మరియు పరీక్ష ప్రారంభానికి ముందు సిబ్బంది ప్రశ్నాపత్రం విధానం, సమాధానాలు నమోదు చేసే పద్ధతిని వివరించనున్నారు. పరీక్ష సమయంలో అధికారుల సూచనలను పాటిస్తూ ప్రశాంతంగా పరీక్ష రాయాలని కలెక్టర్ కోరారు. పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ సమయాలు ఉదయం సెషన్‌కి 7.30 గంటల నుండి 8.50 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌కి 12.30 నుండి 1.50 గంటల వరకు ఉంటాయి మరియు ఉదయం సెషన్ అభ్యర్థులను 11.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్ అభ్యర్థులను 4.30 గంటలకు మాత్రమే పరీక్ష పూర్తయిన తర్వాత బయటకు పంపుతారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందుగానే గుర్తించుకోవాలని, పరీక్ష పూర్తయ్యే వరకు ఎవరికీ బయటకు వెళ్ళడానికి అనుమతి ఉండదని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ