తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం మణుగూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల మరియు తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల మరియు వసతి గృహం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తరగతి గదులు, భోజనశాల, వసతి గృహాలు, పాఠశాల పరిసరాలను సమగ్రంగా పరిశీలించారు. హాస్టల్ తనిఖీ సమయంలో విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటించి, వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, త్రాగునీరు, మంచం, దుప్పట్లు, స్నానాల గదులు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. తరగతి గదులను సందర్శించిన ఆయన, విద్యార్థుల చదువుపై ఆసక్తి, ఉపాధ్యాయుల బోధన నాణ్యత, అభ్యాస స్థాయి పై సమగ్ర సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, ప్రభుత్వమందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధ్యాయులు పాఠ్యబోధనతో పాటు పోటీ పరీక్షల శిక్షణను కూడా అందించాలని ఆయన గైడ్ చేశారు. భోజనశాల పరిశీలనలో, ఆహార పదార్థాల నిల్వ, వంటశాల శుభ్రత, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను కలెక్టర్ ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. తాజా పదార్థాలతోనే వంట చేయాలని, ఆహారం పోషకాహారంతోనూ, రుచికరంగానూ ఉండేలా జాగ్రత్త పడాలని సిబ్బందికి ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యను అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదు అని, వసతి, భోజనం, శుభ్రత, భద్రతపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి అని ఆదేశించారు. విద్యార్థులు పుస్తకాలతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ప్రతిభ కనబరచేలా అవకాశాలు కల్పించాలి అన్నారు. పాఠశాలల నెలకొన్న సమస్యలపై నివేదికలు అందించాలని తక్షణమే పరిష్కారం చూద్దామని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ