తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భవిత కేంద్రాలు పిల్లల మానసిక, శారీరక వికాసానికి బలమైన వేదికలు కావాలి – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం కొత్తగూడెం బాబు క్యాంపు ప్రాంతంలో ఉన్న పీఎం శ్రీ ప్రభుత్వ హై స్కూల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు భవిత కేంద్రాన్ని సందర్శించి పలు అంశాలను సమీక్షించారు.కలెక్టర్ మొదట పీఎం శ్రీ ప్రభుత్వ హై స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి, తరగతులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా విధానాలు, పాఠశాలలో లభ్యమవుతున్న సౌకర్యాలు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల వినియోగం, స్మార్ట్ బోర్డుల ద్వారా పాఠ్యాంశ బోధన విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి, వారు నేర్చుకుంటున్న విషయాలు, తమ భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. పదవ తరగతి గదిలోకి వెళ్లి ఆ సమయంలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీవీలను ఉపయోగిస్తున్నారా వీటి ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరు ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఖాన్ అకాడమీలో విద్యార్థులను రిజిస్టర్ చేశారని ప్రధానోపాధ్యాయులు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ – పీఎం శ్రీ పథకం కింద ప్రతి పాఠశాలను ఉత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని,ఈ పాఠశాలలు భవిష్యత్తులో దేశానికి మార్గదర్శకులుగా నిలిచే విద్యార్థులను తయారు చేయాలి అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించేలా బోధన విధానాలను అవలంబించాలి, అని సూచించారు.అలాగే పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మైక్రో లెర్నింగ్ కార్యక్రమాలు, సైన్స్ ప్రాజెక్టులు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలల్లో పోషకాహార మెనూ, మిడ్‌డే మీల్ నాణ్యత, పిల్లల ఆరోగ్య రికార్డులు కూడా పరిశీలించారు.అనంతరం కలెక్టర్ బాబు క్యాంపులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, ఆటలు, శ్రద్ధల గురించి తెలుసుకున్నారు. చిన్న పిల్లలలో పాఠశాలపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు సృజనాత్మక పద్ధతులు ఉపయోగించాలని సూచించారు. ప్రాథమిక స్థాయి విద్యనే పిల్లల భవిష్యత్తుకు పునాది అన్నారు. అందుకే ఈ దశలో విలువాధారిత విద్య అత్యంత ముఖ్యం అని ఆయన తెలిపారు.తరువాత ఆయన భవిత కేంద్రం ను సందర్శించి, అక్కడ జరుగుతున్న పిల్లల సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాలు, తల్లిదండ్రుల అవగాహన సమావేశాలు, శిశు సంరక్షణ పథకాలు గురించి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరీక్షలు, బరువు కొలతలు, పోషకాహార పంపిణీ తదితర అంశాలను సమీక్షించారు. భవిత కేంద్రం ద్వారా తల్లి-శిశు ఆరోగ్య పరిరక్షణ, పిల్లలలో మానసిక-శారీరక వికాసం సాధించడానికి ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయురాలు నీరజ, బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ