తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పిల్లల భద్రత వారోత్సవాల సందర్భంగా మండల స్థాయి సమీక్ష సమావేశం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, బాలికలు విద్యపై పూర్తి దృష్టి సారించి తమ లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా క్రమశిక్షణతో ముందుకు సాగాలని, తమ భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. వేసవి సెలవులను సృజనాత్మకంగా వినియోగిస్తూ సింగింగ్, పెయింటింగ్, డ్రాయింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, సమయాన్ని వృథా చేయకుండా కెరీర్ అభివృద్ధి, నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండటం ప్రతి విద్యార్థికి అవసరమని అన్నారు . ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా కిషోర బాలికల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో డ్రగ్స్ దుష్ప్రభావాలు, వ్యక్తిగత భద్రత, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై వివరించారు. ఈ దశలో బాలికలు శారీరక, మానసిక మార్పులను ఎదుర్కొంటారని, అందువల్ల వారికి తగిన మార్గదర్శకత్వం, పోషకాహారం, మానసిక మద్దతు అవసరమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతర పర్యవేక్షణ వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బందికి మొబైల్ ఫోన్లు అందజేసి పోషణ ట్రాకింగ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. సురక్షిత బాలికల సాధనలో భాగంగా విద్య, ఆరోగ్యం, రక్షణ అంశాలపై సమగ్ర దృష్టి అవసరమని, ప్రతి బాలికకు భద్రమైన వాతావరణం కల్పించడం సమాజ బాధ్యత అని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల నివారణపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో “బాల్య వివాహం – బ్రతుకు ఆగం” గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం, బాల్యవివాహాలను చేసుకోబోమని, ప్రోత్సహించబోమని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాల్యవివాహాల నిర్మూలనకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. సఖి వన్ స్టాప్ సెంటర్ మొబైల్ అవగాహన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి, ఆ కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలపై అవగాహన గోడపత్రికను ఆవిష్కరించారు. పిల్లల భద్రతకు సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే టోల్ ఫ్రీ నెంబర్ 1098 పోస్టర్‌ను కూడా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ నెంబర్ ద్వారా పిల్లలకు సంబంధించిన సమస్యలను వెంటనే అధికారులకు తెలియజేయవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ సేవను వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లేనినా, తాసిల్దారు వీరభద్రం, మండల స్థాయి అధికారులు, అంగన్వాడి సిబ్బంది, వైద్యశాఖ అధికారులు, కిశోర బాలికలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ