తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూలూరుపాడు రైతు వేదికలో గురువారం మండల స్థాయి సభను నిర్వహించారు. ఈ సభకు జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించగా, అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలో రహదారుల భద్రత అర్రైవ్ అ లైవ్, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, మహిళ సంఘాలు వంటి వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను అధికారులు సభలో తెలియజేశారు. అనంతరం సర్పంచులు తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో సమస్యలను గుర్తించి పరిష్కరించే ప్రక్రియ వేగవంతమవుతోందన్నారు. ఇప్పటికే గ్రామసభలు నిర్వహించడం, సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు విధులు సమర్థంగా నిర్వహిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు . ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సమగ్ర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ముందస్తుగా బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నిర్దేశిత మెనూను కచ్చితంగా పాటించేలా పాఠశాలల్లో పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యను మధ్యలో ఆపివేసిన (డ్రాప్‌అవుట్) విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్చే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని, వేసవి తీవ్రత దృష్ట్యా ప్రధాన కూడళ్లలో, కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించేలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు . చేయూత వంటి సంక్షేమ పథకాల అమలులో అర్హులైన వారికి మాత్రమే లబ్ధి చేకూరేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని అన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ వ్యవస్థ కీలకమని, సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా వ్యవహరించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం మోడల్ గ్రామపంచాయతీలను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. రహదారి భద్రతపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వినూత్న ఆలోచనలతో ప్రమాదాలను నివారించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా అనంతారం గ్రామంలో భూగర్భ జలాల్లో అధిక ఫ్లోరైడ్ సమస్య కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్, గ్రామానికి సురక్షితమైన మంచినీటి సరఫరా కల్పించే దిశగా మిషన్ భగీరథ అధికారులను తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో తాళ్లూరి రవి , అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ