తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో గురువారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ముందుగా రోడ్డు భద్రతకు సంబంధించి, తీసుకుంటున్న చర్యల గురించి సంబంధిత శాఖ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో మోటారు వాహనాలు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు నానాటికి అధికమవుతున్నాయన్నారు. వాహనాలు కండిషన్ గా లేకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నల్ పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల భారిన పడిన వారి కుటుంబ సభ్యులు అనాధలవుతున్నారన్నారు.రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించడానికి పోలీసులు, ఆర్‌అండ్‌బీ, వైద్యశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేసి, జైలు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. వీటిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసు శాఖను ఆదేశించారు.జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు రబ్బరు వేగ నియంత్రికలు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని రవాణాశాఖను ఆదేశించారు. రహదారుల కూడళ్లు, ధాబాలు, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని శాఖలు కలిసి సమన్వయంతో శ్రమిద్దామని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలోట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ భద్రాచలం చంద్రశేఖర్, ఆర్ అండ్ బి ఈ ఈ లు కొత్తగూడెం, భద్రాచలం వెంకటేశ్వర్లు, లాల్ సింగ్, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ఇల్లందు శ్రీకాంత్, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆర్టీవో వెంకటరమణ,ఎం వి ఐ వెంకట పుల్లయ్య, కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్, డి ఎం హెచ్ ఓ భాస్కర్ నాయక్ , నేషనల్ హైవే డి ఈ శైలజ, మెడికల్ డిపార్ట్మెంట్ వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ