తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియపై పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించి, ఎన్నికల సంఘం నిర్దేశించిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026లో భాగంగా ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎంటీలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లు, ఏఎల్‌ఎంటీలు, మండల ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, అవసరమైన వివరాలను సేకరించి బీఎల్‌వో యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు.ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వ్యక్తులు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లారా, మరణించారా, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు నమోదై ఉన్నారా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలను నిబంధనల మేరకు నిర్వహించాలని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా సేకరించిన సమాచారమే తుది ఓటరు జాబితా రూపకల్పనకు ప్రామాణికంగా ఉండనున్నందున ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత కలిగిన వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఫారం-6 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ప్రతి వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలని, ఉద్దేశపూర్వకంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటరు నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అటువంటి సందర్భాల్లో క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీని ఇతరులకు తెలియజేయరాదని, అలా చేయడం కూడా నేరంగా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ మాట్లాడుతూ , ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. బీఎల్‌వోలు ఇంటింటి సర్వేలో సేకరించే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. బీఎల్‌వో యాప్‌లో వివరాలను సకాలంలో నమోదు చేసి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా కృషి చేయాలని సూచించారు.భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ , ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఒక్క అర్హ ఓటరు కూడా మిగిలిపోకుండా చూడాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల ఓటరు వివరాల ధృవీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ సర్వే నిర్వహించాలని తెలిపారు.అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ , శిక్షణలో వివరించిన అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్ ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారాల నిర్వహణ, బీఎల్‌వో యాప్ వినియోగం, ఓటరు మ్యాపింగ్, ఫారాల పరిశీలన, డేటా నమోదు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర అవగాహన కల్పించారు.కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎంటీలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లు, ఏఎల్‌ఎంటీలు, మండల ఆపరేటర్లు, ఎన్నికల శాఖ సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ