తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ వారంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ బూర్గంపహాడ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, విద్యా కార్యక్రమాల అమలు, పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు పాఠశాలలో నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్, డ్రాయింగ్ పోటీలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని , మరింత విస్తృతంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని సదుపాయాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల కిచెన్ షెడ్‌ను పరిశీలించి, మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తాజా కూరగాయల వినియోగం, ఆహార తయారీ, వడ్డింపులో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అలాగే పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలపై కూడా ఆరా తీశారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. అనంతరం బూర్గంపహాడ్ వ్యవసాయ కమిటీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలించి, మాయిశ్చర్ మీటర్ ద్వారా తేమ శాతాన్ని తనిఖీ చేశారు. ధాన్యం నాణ్యత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పురోగతి, పెండింగ్ ధాన్యం వివరాలు తెలుసుకుని, సన్న మరియు దొడ్డు రకం ధాన్యాల కొనుగోలుకు వేర్వేరు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని, లైటింగ్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలని అధికారులను ఆదేశించారు. పి.ఆర్–126 దొడ్డు రకం ధాన్యం నాణ్యతపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి, పిన్‌పాయింట్ డ్యామేజ్ సమస్యపై పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాల విషయంలో స్పష్టత తీసుకువచ్చి రైతులకు నష్టం కలగకుండా చూడాలని తెలిపారు ప్రతి రైతు వద్ద ఉన్న చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, ఎవరూ నష్టపోకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కొనుగోలు రిజిస్టర్, రసీదు పుస్తకాలను పరిశీలించి నమోదు విధానాన్ని సమీక్షించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఎంపీడీవో జమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ