తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి శాఖ కార్యక్రమాలపై ప్రత్యేక డాక్యుమెంటేషన్ రూపొందించాలి జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన ప్రత్యేక అధికారి శ్రీధర్ ఐఏఎస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ ఐఏఎస్, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తో కలసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అన్ని శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజావాణి, గ్రామసభల ద్వారా అందిన భూ సమస్యలు, ఇతర సమస్యలకు సంబంధించిన మొత్తం 16,549 దరఖాస్తుల్లో 11,309 దరఖాస్తులను పరిష్కరించగా, 5,240 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయని తెలిపారు. ఫైల్ క్లియరెన్స్, పారిశుధ్యం, వైద్య ఆరోగ్య సేవలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లాలో గణనీయమైన పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించినట్లు తెలిపారు. గృహనిర్మాణ కార్యక్రమంలో భాగంగా 4,727 గృహప్రవేశాలు నిర్వహించగా, ఇందిరమ్మ గృహాల కోసం రూ.385.55 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,095 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించడంతో పాటు 2,036 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు . వ్యవసాయ రంగంలో 21,952 మంది రైతులకు సన్నబియ్యానికి బోనస్‌గా రూ.67.81 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 40,742.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 5,249 మంది రైతులకు రూ.96.63 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను మొదటగా పూర్తి చేసిన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం నిలిచిందన్నారు. రైతు భరోసా పథకం కింద 2,07,391 మంది రైతుల ఖాతాల్లో రూ.1,044.40 కోట్లు జమ చేయగా, రైతు బీమా ద్వారా 1,924 మంది రైతు కుటుంబాలకు రూ.96.20 కోట్లు అందించినట్లు తెలిపారు. రుణమాఫీ కింద 55,234 మంది రైతులకు రూ.386.15 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. విద్యుత్ శాఖ ద్వారా గండుగులపల్లి గ్రామాన్ని మోడల్ సౌరశక్తి గ్రామంగా అభివృద్ధి చేసినట్లు కలెక్టర్ వివరించారు. విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో విస్తృత స్థాయిలో ప్లాంటేషన్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. వెదురు సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. పోడు వ్యవసాయం కోసం అడవుల నరికివేతను నివారించేందుకు గుత్తికోయ గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహించి అటవీ సంపద పరిరక్షణపై చైతన్యం కల్పించినట్లు వివరించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. గిరిజనులు, పీవీటీజీ కుటుంబాల సంక్షేమం, జీవనోపాధి అభివృద్ధి, విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన చర్యలను వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులకు చేరవేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందన్నారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ గోదావరి నది తీర పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా సాధించిన ఫలితాలను ప్రత్యేక అధికారికి వివరించారు. దశాబ్దకాలంగా చెత్త డంపింగ్ కేంద్రంగా మారిన గోదావరి నది తీర ప్రాంతాన్ని సమగ్ర కార్యాచరణతో శుభ్రపరిచి పునరుద్ధరించిన విధానాన్ని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, ఐదు ఎకరాల భూమిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడం, 10 వేల యూకలిప్టస్ మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టినట్లు తెలిపారు. అక్టోబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు ఐటీడీఏ, గ్రామపంచాయతీ అధికారులు, స్థానిక ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేసి విశేష ఫలితాలు సాధించినట్లు తెలిపారు . జిల్లా ప్రత్యేక అధికారి శ్రీధర్ ఐఏఎస్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను విజయవంతంగా అమలు చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని శాఖలు ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మంచి ఫలితాలు సాధించాయని అన్నారు. ప్రభుత్వం మిషన్ మోడ్‌లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 99 రోజులకే పరిమితం చేయకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. ప్రజావాణి, గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని అన్నారు. ప్రతి శాఖ తమ లక్ష్యాలను నిర్దేశించుకుని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తీసుకున్న చర్యలను నమోదు చేసి ఉత్తమ విధానాలుగా అభివృద్ధి చేయాలని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాలు, కార్యాలయాల పరిశుభ్రత, పాత ఫైళ్ల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు వంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. ప్రతి శాఖ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన కార్యక్రమాలపై ప్రత్యేక డాక్యుమెంటేషన్ రూపొందించాలని ఆదేశించారు. కార్యక్రమాల అమలుకు ముందు, తరువాత పరిస్థితులను స్పష్టంగా చూపించే విధంగా ఫోటోలతో కూడిన "బిఫోర్ అండ్ ఆఫ్టర్" నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. శాఖలు సాధించిన విజయాలు, అమలు చేసిన వినూత్న కార్యక్రమాలు, ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తీసుకున్న చర్యలు, ప్రజలకు కలిగిన ప్రయోజనాలను పొందుపరుస్తూ సమగ్ర నివేదికలు తయారు చేసి అందించాలని తెలిపారు. ఈ నివేదికలు ఇతర జిల్లాలు, శాఖలకు ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో "ప్రగతి" అంటే అభివృద్ధి, "ప్రణాళిక" అంటే కార్యాచరణ అని పేర్కొంటూ, అభివృద్ధిని సాధించేందుకు ప్రణాళికాబద్ధమైన పని విధానం అవసరమని తెలిపారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని, జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ప్రత్యేక అధికారి శ్రీధర్ ఐఏఎస్ సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, డిఆర్ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు, తాసిల్దార్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ