తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న మున్సిపాలిటీల మరియు మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా ఉదయం 11.00 గంటల వరకు మొత్తం 29.30 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలో మొత్తం 3 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 106 వార్డుల్లో ఏర్పాటు చేసిన 288 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం 1,85,348 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి అర్హులని, అందులో పురుషులు 88,738 మంది, మహిళలు 96,572 మంది, ఇతరులు 38 మంది ఉన్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల వరకు మొత్తం 54,298 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. పట్టణాల వారీగా చూస్తే అశ్వరావుపేట మున్సిపాలిటీలో 45.18 శాతం పోలింగ్ నమోదు కాగా, 16,850 మంది ఓటర్లలో 7,613 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,34,775 మంది ఓటర్లలో 38,362 మంది ఓటు వేయగా, అక్కడ 28.46 శాతం పోలింగ్ నమోదైంది. యెల్లందు మున్సిపాలిటీలో 33,723 మంది ఓటర్లలో 8,323 మంది ఓటు హక్కు వినియోగించుకుని 24.68 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, షెడ్లు, వీల్‌చైర్లు తదితర మౌలిక వసతులు కల్పించామని, వృద్ధులు మరియు దివ్యాంగులు సౌకర్యవంతంగా ఓటు వేయేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. మిగిలిన సమయాన్ని వినియోగించుకుని ఓటర్లు స్వేచ్ఛాయుత, భయరహిత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ