తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 07, 08 తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు హక్కు వినియోగం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట, ఇల్లందు మరియు కొత్తగూడెం మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల విధుల్లో నియమితులైన అధికారులు, ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది మరియు సహాయక సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండటం వలన పోలింగ్ రోజున తమ స్వంత పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయలేని సిబ్బంది ప్రజాస్వామ్య హక్కును కోల్పోకుండా ఉండేందుకు, Conduct of Elections Rules, 1961 లోని రూల్ 27A, రూల్ 28 మరియు Representation of the People Act, 1951 లోని సెక్షన్ 60 ప్రకారం ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.ఈ మేరకు అశ్వారావుపేట, ఇల్లందు మరియు కొత్తగూడెం మున్సిపాలిటీలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఎన్నికల సిబ్బంది కొత్తగూడెం మరియు పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయాలలో, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు ఇల్లందు మున్సిపాలిటీ కార్యాలయంలో, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు కలిగిన వారు అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ నెల 07 మరియు 08 తేదీల్లో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో నియమితులైన అన్ని శ్రేణుల అధికారులు, ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల నిఘా బృందాలు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది తదితరులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ఎన్నికల విధుల ఉత్తర్వు ప్రతిలిపి, ఉద్యోగ గుర్తింపు కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు (EPIC) మరియు ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.ఫెసిలిటేషన్ సెంటర్లలో అవసరమైన పత్రాల ధృవీకరణ అనంతరం పోస్టల్ బ్యాలెట్ పేపర్ జారీ చేయబడుతుందని, నిర్ణీత విధానంలో గోప్యంగా ఓటు వినియోగించి, సీల్ చేసిన ఎన్వలప్‌ను రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఏర్పాటు చేసిన సీల్ చేయబడిన పోస్టల్ డ్రాప్ బాక్స్‌లో వేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా గోప్యతతో, ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి మరియు సిబ్బంది తమ ప్రజాస్వామ్య హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఇందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినదని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. నిర్ణీత తేదీల్లో అందరూ వ్యక్తిగతంగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ