తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో సాగుతున్న అధిక ఫీజుల దోపిడీని తక్షణమే అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏడీఈఓ శ్యామ్ ప్రసాద్‌కు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్ మాట్లాడుతూ...జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో దందా సాగిస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పాఠశాలల్లోనే పాఠ్య పుస్తకాలు, టై, బెల్ట్, యూనిఫాం, షూలను అధిక ధరలకు విక్రయిస్తూ విద్యను పూర్తి వ్యాపారంగా మార్చేశారని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమని, ఇక్కడి పేద, మధ్యతరగతి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి యథేచ్ఛగా సాగుతున్న విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని, విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు ఇనపల్లి పవన్ సాయి, మాణిక్యాల వినయ్, జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్, సంఘం నాయకులు కళ్యాణ్, నవీన్, మహేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ