తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు . సోమవారం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడి వైద్య సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యం, సౌకర్యాలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని లాబరేటరీలో నిర్వహిస్తున్న పరీక్షా విధానాన్ని పరిశీలించి, పరీక్షలు నాణ్యతగా నిర్వహించాలని సూచించారు. అలాగే మందుల గిడ్డంగిని తనిఖీ చేసి, అవసరమైన అన్ని రకాల ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో రోజువారీ ఓపీకి ఎంతమంది రోగులు వస్తున్నారో తెలుసుకున్నారు. రక్త పరీక్ష కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షల వివరాలు, అందుబాటులో ఉన్న టీకాల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సేవల స్థితిగతులు, అవసరమైన ఔషధాల లభ్యతపై సమగ్రంగా ఆరా తీశారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతర వైద్య సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ కుక్క కాటుకు గురైన ఒక బాలుడిని పరామర్శించి, అతనికి అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని స్పష్టం చేశారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, ప్రజలకు సమర్థవంతమైన మరియు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో వైద్య సేవల మెరుగుదలకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీ లో మెడికల్ ఆఫీసర్ స్వప్న టిపిఎమ్ఓ ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ