తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ ఆఫీసర్లు మరియు ల్యాబ్ టెక్నీషియన్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్ పాల్గొన్నారు.మొదటి విడతగా ల్యాబ్ టెక్నీషియన్లతో నిర్వహించిన సమావేశంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ప్రత్యేక ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, శాంపిల్ సేకరణను వేగవంతంగా నిర్వహించడం, రోగులకు సరైన నిర్ధారణ చేసి తగిన చికిత్స అందించడంపై సూచనలు చేశారు.అనంతరం నర్సింగ్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ప్రసవాల శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అవసరం లేని సిజేరియన్ ప్రసవాలను తగ్గించాలని సూచించారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ANC పరీక్షలు నిర్వహించి, హై రిస్క్ గర్భిణీల ప్రత్యేక ప్రొఫైల్‌ను నిర్వహించాలని, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిరంతర పరీక్షలు చేయించాలని తెలిపారు. అలాగే EDD క్యాలెండర్‌ను సక్రమంగా నిర్వహిస్తూ ప్రసవ తేదీలను ముందుగానే గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.గర్భిణీలలో రక్తహీనత (అనీమియా) గుర్తింపు, చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి గర్భిణికి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో సికిల్ సెల్ అనీమియా అధికంగా ఉన్న ప్రాంతాల్లో గర్భిణీలకు తప్పనిసరిగా సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు.మాతృ మరణాల రేటు (MMR), శిశు మరణాల రేటు (IMR) తగ్గించేందుకు ప్రతి గర్భిణికి సమగ్ర ఆరోగ్య సేవలు అందించాలని తెలిపారు. గర్భిణీలు యోగా, తేలికపాటి వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండేలా ఆరోగ్య విద్య అందించాలని సూచించారు.ప్రసవానంతరం తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి తల్లికి అవగాహన కల్పించాలని, శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లి మరియు శిశు ఆరోగ్యానికి తల్లిపాలు అత్యంత ముఖ్యమని వివరించాలని సూచించారు.ప్రసూతి వార్డులు, లేబర్ రూమ్‌లలో అన్ని ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని, వార్డుల పరిశుభ్రత మరియు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటిస్తూ, వ్యర్థాల వేరు వేరు నిర్వహణకు ప్రత్యేక బిన్లను వినియోగించాలని ఆదేశించారు.అదేవిధంగా OP, IP రిజిస్టర్లు మరియు ఇతర రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి నిర్వహించాలని సూచించారు. పాము కాటు, కుక్క కాటు మరియు ఇతర జంతువుల కాటు బాధితులకు తక్షణ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలనితెలిపారు.ప్రతి కేంద్రంలో "నార్మల్ డెలివరీ మోటివేషన్" వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి, గర్భిణీ స్త్రీలకు ప్రతిరోజూ యోగా మరియు తేలికపాటి వ్యాయామాలపై అవగాహన కల్పించడం ద్వారా సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నర్సింగ్ ఆఫీసర్లను ఆదేశించారు.సమతుల్య ఆహారం (Balanced Diet) ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. రోజువారీ ఆహారంలో సుమారు 50 శాతం కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు, 25 శాతం ప్రోటీన్లు, 25 శాతం పండ్లు, కూరగాయలు మరియు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.జిల్లాలో HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఆరోగ్య విద్య కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్యకర జీవనశైలి, వ్యాయామం, పోషకాహారం ప్రాముఖ్యతను వివరించాలని నర్సింగ్ ఆఫీసర్లకు సూచించారు.ఈ సమావేశంలో మాతృ-శిశు ఆరోగ్య సేవల బలోపేతం, సాధారణ ప్రసవాల పెంపు, మాతృ మరియు శిశు మరణాల తగ్గింపు, అనీమియా నివారణ, సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్, తల్లిపాల ప్రోత్సాహం మరియు నాణ్యమైన వైద్య సేవల అందజేతపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. సాయి కళ్యాణ్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ప్రతాప్, డా. రాందాస్, డా. దినేష్, డా. రాకేష్, డా. హరీష్ మరియు జిల్లాలోని నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ