తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంగనవాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ. ఘనంగా పోషణ పక్వాడ కార్యక్రమ ప్రారంభోత్సవం.తిరుమలాయపాలెం:(శనివారం 11): తిరుమలాయపాలెం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత అధ్యక్షతన పోషణ్ పక్వాడా కార్యక్రమం ప్రారంభోత్సవం, అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని అంగనవాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15 వేల అంగనవాడి టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో 1840 అంగనవాడి కేంద్రాలు ఉండగా అందులో 501 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా జిల్లాలో అద్దె భవనాల్లో నడుస్తున్న 501 అంగనవాడి కేంద్రాలను శాశ్వత ప్రాతిపదికన త్వరలోనే నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల జీతభత్యాల పెంపుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించి అమలు పరచడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి అవలంబించారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అంగన్వాడీల సంక్షేమం కోసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందజేయడం జరుగుతుందని, గత ప్రభుత్వ హయాంలో రిటైర్ అయిన వారికి కూడా ఈ ప్రభుత్వం ఒక కొత్త జీవో తెచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేవిధంగా కృషి చేసిందని, ఆ ఘనత రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు దక్కుతుందని తెలిపారు.అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ ద్వారా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. దీనివల్ల గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ విధానంలో త్వరగా నమోదు చేయవచ్చు అని, అంగనవాడి టీచర్ల పని భారం తగ్గించడానికి ప్రభుత్వ మొగ్గు చూపిందని, గతంలో అంగనవాడి టీచర్లు వారి కేంద్ర పరిధిలో నమోదైన లబ్ధిదారులకు అందిస్తున్న సేవలను సుమారు 16 రిజిస్టర్లలో నమోదు చేయాల్సి ఉండగా వారి పని భారం తగ్గించి కాలానుగుణంగా అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ ఫోన్లు ప్రభుత్వం అందజేసిందని, క్షేత్రస్థాయిలో అంగనవాడి టీచర్లు కేంద్రాలలో నమోదైన గర్భిణీలు, బాలింతలు పిల్లలకు సరైన సమయంలో సరైన పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో అంగనవాడి కేంద్రాల ద్వారా అందించే సేవలను విస్తృతపరిచి అన్ని శాఖల సమన్వయంతో పారదర్శకతతో కూడిన సేవలు అందించాలని, పోషణ లోప రహిత జిల్లాగా ఖమ్మం జిల్లా పేరు పొందాలని,టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ వల్ల డేటా సేకరణ, నివేదికల పంపిణీ మరియు లబ్ధిదారుల వివరాల నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు. పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము ప్రాజెక్టు, సెక్టార్ మరియు అంగనవాడి కేంద్ర స్థాయిలో పౌష్టికాహార విలువలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి, ఈ 15 రోజులు నిర్వహించే రోజు వారి కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులను, గ్రామ పెద్దలను, గర్భిణీలును బాలింతలను భాగస్వామ్యం చేసి అంగన్వాడి కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలతో పాటు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిగతులపై నివేదిక అందజేయడం జరుగుతుందని ,దాని అనుగుణంగా భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని తెలిపారు. ప్రతినెల మొదటి వారంలో అంగనవాడి కేంద్రాలలో నమోదైన ఆరు సంవత్సరాల లోపు పిల్లల ఎత్తు బరువులు తూచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా అప్లికేషన్లలో నమోదు చేసినట్లయితే అతి తీవ్ర పోషణ లోపం, తీవ్ర పోషణ లోపం, పోషణ లోపం అనేది సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించడం జరుగుతుందని, దాని ద్వారా స్థానిక వైద్యాధికారుల సూచనల మేరకు న్యూట్రిషన్ రిహాబిటేషన్ సెంటర్ కు సిఫార్సు చేసి ప్రత్యేక పర్యవేక్షణ ఆ యొక్క పిల్లలపై పెట్టి సాధారణ స్థితికి వచ్చేవరకు అంగనవాడి టీచర్ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో పోషణ మాసం నిర్వహణ, పోషణ పక్వాడ నిర్వహణ, తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించడమే కాకుండా ఆ యొక్క వివరాలు మరియు ఆ ఫోటోలు ప్రభుత్వానికి అందజేయడంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉండడం గర్వించదగ్గ విషయమని, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అంగనవాడి టీచర్లు ,హెల్పర్లు కేంద్రానికి వచ్చే లబ్ధిదారులకు పారదర్శకతతో కూడిన సేవలందిస్తున్నారని కొనియాడారు. ఈరోజు అంగనవాడి టీచర్ల స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రెండు కోట్ల మూడు లక్షల 50 వేల రూపాయల విలువైన అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగిందని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులకు నాణ్యత మరియు పారదర్శకత తో కూడిన సేవలు అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఎడిషన్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రామసాయం నరేష్ రెడ్డి, సిడిపివోలు, ఏసిడిపివోలు, సూపర్వైజర్లు, అంగనవాడి టీచర్లు, హెల్పర్లు పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ