తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖాధికారి, మండల స్థాయి పశువైద్యాధికారులు, జిల్లా వెటర్నరీ వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గిరిజన గ్రామాలలో గిరిజనులు మరియు మహిళల వద్ద ఉన్న మేకల సంతతిని అభివృద్ధి చేసి అధిక పాల దిగుబడి సాధించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మేకపాల విశిష్టతను ప్రజలకు తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మేకపాల నుండి పెరుగు, మజ్జిగ, జున్ను, పన్నీరు, చీజ్ వంటి ఉత్పత్తులను తయారు చేసి వినియోగించే పద్ధతులపై గిరిజనులు మరియు మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.
అదేవిధంగా, మేకపాలను ప్రోత్సహించడం ద్వారా మేకలు అడవుల్లో లభించే ఆకులు, చెట్లు మేతగా తీసుకోవడం వలన అడవులను రక్షించవచ్చని, అడవులు మనలను రక్షిస్తాయని కలెక్టర్ తెలిపారు. మేకల మేత కోసం అవసరమైన మొక్కలను నాటడం ద్వారా అడవుల అభివృద్ధి జరగగలదని, దీని వల్ల గిరిజనులు, మహిళలు, సమాజం మొత్తానికి లాభం చేకూరుతుందని వివరించారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యకరమైన మేకపాలను అందించడానికి ప్రత్యేకంగా మేకపాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వీటి మార్కెటింగ్ ద్వారా గిరిజనులు మరియు మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని కలెక్టర్ తెలిపారు.
ఇకపై గిరిజనులు మరియు మహిళలను బాతులు, కౌజు పిట్టల పెంపకంపై కూడా ప్రోత్సహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, ఈ చర్యల ద్వారా ఆదివాసీ కుటుంబాలు మరియు మహిళలు ఆర్థికంగా లాభపడడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం పొందగలరని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖాధికారి, మండల స్థాయి పశువైద్యాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ