తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియంలో వాహనదారులకు అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ గారి సూచనలతో సబ్ డివిజన్ పోలీసులు వాహనదారులకు,విద్యార్థినీ,విద్యార్థులకు ముఖ్యంగా ఆటోడ్రైవర్లకు జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా భారీ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారు.ఎస్పీ గారితో పాటు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,కొత్తగూడెం మున్సిపల్ కమీషనర్ శేషాంజనేయ స్వామి,జిల్లా రవాణాధికారి వెంకట రమణలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముందుగా విద్యార్థులతో కలిసి అక్కడ రోడ్డు భద్రతా నియమాలను సూచిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవించి చాలామంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు.వాహనదారులందరూ హెల్మెట్,సీట్ బెల్ట్ లు ధరించి వాహనాలను నడపాలని కోరారు.ర్యాష్ డ్రైవింగ్,మద్యం సేవించి వాహనాలు నడపడం,ఓవర్ లోడ్,రాంగ్ రూట్లో ప్రయాణించడం లాంటి తప్పిదాలతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 500 కు పైగా ఆటో డ్రైవర్లు తమ వాహనాలతో సహా హాజరయ్యారు
వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ సోదరులు కూడా ఖాకీ యూనిఫామ్ ధరించి ఈ కార్యక్రమానికి హాజరవడంతో ప్రకాశం స్టేడియం ప్రాంగణమంతా ఖాకీమయమైందని అన్నారు.ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలను ఉపయోగించుకోవాలని సూచించారు.పోలీస్ శాఖతో పాటు ప్రజలతో నిరంతరం ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండేది ఆటో డ్రైవర్లు మాత్రమే అని అన్నారు.పోలీసు వారు సూచించిన నియమాలను పాటించి ఆటో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు మరియు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి బాధ్యత గల పౌరులుగా కూడా మెలగాలని కోరారు.అనంతరం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వేల ఆటోలకు సంబంధించి పోలీస్ శాఖ తరపున తయారుచేసిన స్టిక్కర్లను ఎస్పీ ఆవిష్కరించారు.ఆటో డ్రైవర్ల అందరూ కూడా తమ సమాచారంతో కూడిన స్టిక్కర్లను కచ్చితంగా అమర్చుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం మరియు జిల్లా పౌరసంబంధాల శాఖ కళాకారుల చేత ట్రాఫిక్ అవగాహనపై పాటల రూపంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ట్రాఫిక్ ఎస్ఐలు నరేష్,మదార్ మరియు పట్టణ సీఐలు కరుణాకర్,రమేష్,శివ ప్రసాద్ మరియు జూలూరుపాడు సీఐ ఇంద్రశేనారెడ్డి లను శాలువాలతో ఎస్పీ సత్కరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ