తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ రికార్డ్ రూమ్’ను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయమునకు చెందిన పాత రికార్డులను ఒకే చోట భద్రపరచడం, రికార్డుల ప్రక్షాళన చేయడం, అలాగే డిజిటలైజేషన్ ద్వారా రికార్డులను సులభంగా గుర్తించి వినియోగించుకునేలా ఆధునిక సదుపాయాలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సెంట్రల్ రికార్డ్ రూమ్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడం, అవసరమైన పత్రాలను వేగంగా అందుబాటులోకి తేవడం, పాత రికార్డుల భద్రతను నిర్ధారించడం మరియు డిజిటల్ విధానాల ద్వారా పారదర్శకతను పెంపొందించడం అని కలెక్టర్ తెలిపారు. రికార్డుల డిజిటలైజేషన్ వల్ల సమయం, శ్రమ ఆదా కావడంతో పాటు, భవిష్యత్‌లో ఈ-ఆఫీస్ విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ, కలెక్టరేట్ సూపర్డెంట్లు , ఎలక్షన్ సూపర్డెంట్ రంగ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ