తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మరియు నేషనల్ హైవేస్ డి ఈ శైలజ ఈ వీడియో కాన్ఫిడెన్స్ లో పాల్గొన్నారు. దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని, జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని పరిశీలిస్తానని జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ