తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏజెన్సీ ప్రాంత వైద్య సేవల్లో ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా భద్రాద్రి జిల్లా.ధన్యవాదాలు తెలిపిన ఆసుపత్రి సూపరింటెండెంట్లు.99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రదానం చేసిన అవార్డుల్లో సుమారు 20 శాతం అవార్డులు జిల్లా టీవీవీపీ ఆసుపత్రులకు దక్కిన సందర్భంగా ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు నేడు పాల్వంచలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.నాటి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ నుండి నేటి జిల్లా కలెక్టర్ అంకిత్ వరకు సంపూర్ణ మద్దతు, సహకారం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని సూపరింటెండెంట్లు స్పష్టం చేశారు. వివిధ సమావేశాల్లో గౌరవ ఎమ్మెల్యేలు, మంత్రివర్యులు సూచించిన అంశాలను ముందుండి అమలు చేయడంలో కలెక్టర్ గారు కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఆయన ముందడుగు, నిరంతర సహకారం సిబ్బందికి నైతిక బలం ఇచ్చి మెరుగైన ఫలితాలు సాధించడానికి దోహదపడిందన్నారు. సమయానుకూల ప్రణాళిక, ప్రోత్సాహం సిబ్బందిలో వృత్తి పట్ల నిబద్ధత పెంపొందించగా, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ దూరప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, వసతులు, ప్రమాణాల మెరుగుదలకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపినట్లు పేర్కొన్నారు.గత ఒకటిన్నర సంవత్సరంగా దూరప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి విస్తృత చర్యలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో రక్త నిల్వ కేంద్రాల స్థాపన, ఆపరేషన్ థియేటర్ల అభివృద్ధి, నిపుణులైన వైద్యులను ప్రోత్సాహకాలతో నియామకం, డయాలిసిస్ కేంద్రాల ఏర్పాటు, OPD మరియు ఆపరేషన్ థియేటర్ పరికరాల సమీకరణ, డిజిటల్ ఎక్స్-రే, ECG యంత్రాల ఏర్పాటు, ఆసుపత్రుల మరమ్మత్తులు, పునరుద్ధరణ, CC కెమెరాలు, తాగునీటి సౌకర్యాలు, డైట్, శానిటేషన్ సదుపాయాలు, వార్డుల్లో ACలు, కూలర్లు తదితర మౌలిక వసతులు మెరుగుపరచబడినట్లు వివరించారు.ఈ చర్యల ఫలితంగా అవుట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగి, ఆసుపత్రుల్లో పడకలు సరిపోని స్థితి ఏర్పడినట్లు తెలిపారు. ప్రసవాలు, శస్త్రచికిత్సలు భారీగా పెరిగి, టోటల్ నీ రీప్లేస్‌మెంట్, ల్యాపరోస్కోపిక్ వంటి స్పెషాలిటీ సేవలు విజయవంతంగా నిర్వహించబడుతున్నట్లు పేర్కొన్నారు. క్లిష్ట కేసులను స్థానికంగానే నిర్వహించడం వల్ల రిఫరల్ కేసులు గణనీయంగా తగ్గినట్లు తెలిపారు.ఈ కృషికి రాష్ట్ర ప్రభుత్వం నుండి గతం లో సైతం గుర్తింపు లభించడంతో పాటు ITDA PO, రాష్ట్ర TVVP కమిషనర్, ఆరోగ్య కార్యదర్శి, ఆరోగ్య మంత్రివర్యులు తదితర ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందినట్లు తెలిపారు.స్థానిక శాసన సభ్యులు కూడా తెలంగాణ శాసనసభలో ఈ సేవలను అభినందించడం చారిత్రాత్మక ఘట్టం గా పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్లు డాక్టర్ రామకృష్ణ, రామ్ ప్రసాద్, గౌరీ ప్రసాద్, హర్ష వర్ధన్, జీ జీ హెచ్ సూపరింటెండెంట్ రాధ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ