తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి కార్పొరేట్ శక్తుల కోసమే సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నారు ధరలు తగ్గించకుంటే ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తాం - ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే ఫహీమ్ ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర ధరలను అరికట్టడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే ఫహీమ్ విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ సోమవారం కొత్తగూడెం పట్టణంలోని రామాటాకీస్ రోడ్డులో సంఘం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కేవలం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చడమే ధ్యేయంగా పనిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని ఆరోపించారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు భారంగా మారాయని పేర్కొన్నారు. తక్షణమే ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే ఖయ్యుమ్, పట్టణ నాయకులు మజ్జిగ రణధీర్, జావీద్, కోచెర్ల రాకేష్, రసూల్, యాకుబ్, కొయ్యడ రవి, అజయ్, వినయ్, సంజయ్, విజయ్ కాంత్, చిన్ను, నాగరాజు, ఆశ్రఫ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ