తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రెండవ సాధారణ ఎన్నికల సన్నాహక సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరగనున్న జెడ్పిటిసి, ఎంపీటిసి మరియు గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. నోడల్ అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, అమలు చేయాల్సిన చర్యల గురించి ప్రత్యేక సూచనలు అందించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జితేష్ పాటిల్ మాట్లాడుతూ..జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పిటిసి, ఎంపీటిసి రెండు విడతలుగా మరియు గ్రామపంచాయతీ మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు వివరించారు. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలై అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై అక్టోబర్ 17న ముగుస్తుందని చెప్పారు. అక్టోబర్ 23, 27 తేదీల్లో జెడ్పిటిసి, ఎంపీటిసి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 11న ప్రకటించబడతాయి. గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు విడతలుగా జరుగుతుందని, పోలింగ్ ముగిసిన రోజే సాయంత్రం ఫలితాలు ప్రకటించబడతాయని కలెక్టర్ వెల్లడించారు. జిల్లా మొత్తం 22 మండలాల్లో రెండు విడతలుగా జెడ్పిటిసి మరియు ఎంపీటిసి ఎన్నికలు జరగనున్నాయి అని తెలిపారు. మొత్తం 22 జెడ్పిటిసి స్థానాలు, 233 ఎంపీటిసి స్థానాలు ఉండగా, మొదటి విడతలో భద్రాచలం డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో 11 జెడ్పిటిసి, 113 ఎంపీటిసి స్థానాలకు గాను 602 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, రెండవ విడతలో కొత్తగూడెం డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో 11 జెడ్పిటిసి, 120 ఎంపీటిసి స్థానాలకు గాను 669 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి అన్నారు. ప్రతి విడతలో 20 శాతం అదనపు రిజర్వ్ పోలింగ్ కేంద్రాలు కూడా సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లా మొత్తం 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులు, 4,242 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొదటి విడతలో 8 మండలాల్లో 159 గ్రామ పంచాయతీలు, రెండవ విడతలో 7 మండలాల్లో 156 గ్రామ పంచాయతీలు, మూడవ విడతలో 7 మండలాల్లో 156 గ్రామ పంచాయతీలలో నిర్వహించబడనున్నాయి అని కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో ఎన్నికల వ్యయాల నమోదు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తక్షణ చర్యలు, ఫ్లయింగ్ స్క్వాడ్ కార్యకలాపాలపై చర్చ జరిగింది. ఎన్నికల సమయంలో అధికారులు, సిబ్బంది ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని, ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ ఫొటోలు, క్యాలెండర్లు, వాల్ పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే రాజకీయ విగ్రహాలకు ముసుగులు కప్పాలని సూచించారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం పంపిణీని గుర్తించి అరికట్టడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ప్రత్యేక చర్యలు చేపడతాయని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్‌తోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమనిబంధనలు, చట్టాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, పబ్లిక్ పార్కులు వంటి ప్రదేశాల్లో ఉన్న హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లు తొలగించాలని ఆదేశించారు. ప్రజలను ప్రభావితం చేసేలా గోడలపై రాసిన నినాదాలను చెరిపివేయాలని అధికారులన కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పకడ్బందీగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద చట్టం, శాంతి భద్రతలు కాపాడటానికి మూడు అంచల భద్రత ఏర్పాటు కు ప్రత్యేక బలగాలు నియమించబడ్డాయని, అక్రమంగా నగదు, మద్యం పంపిణీ అడ్డుకట్ట వేసేందుకు గాను అంతర్రాష్ట్ర సరిహద్దులు వద్ద చెక్ పోస్టులు ఏర్పాటుచేసి అక్రమ రవాణా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలీసులు పూర్తిస్థాయి సహకారం అందిస్తారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఏ ఈ ఆర్ ఓ లు, నోడల్ అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు మరియు ఎం పి ఓ లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ