తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఔషధ రంగంపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యాన్ని అడ్డుకుందాం. మందుల షాపుల యజమానుల న్యాయమైన పోరాటానికి పూర్తి మద్దతు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. ఫార్మసీ రక్షణ కోసం, ప్రజా ఆరోగ్యం పరిరక్షణ కోసం దేశవ్యాపితంగా చేపట్టిన మెడికల్ షాపుల బందులో భాగంగా కొత్తగూడెం కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక గణేష్ టెంపుల్ ఏరియాలో నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నిరసన శిబిరాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సందర్శించి, బంద్‌కు తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వల్లే నేడు మెడికల్ షాపుల యజమానులు రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల స్థానిక వ్యాపారుల జీవనోపాధి దెబ్బతినడమే కాకుండా, నకిలీ మందుల సరఫరా పెరిగి ప్రజారోగ్యం తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా ఉన్న చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఫార్మసీ రంగాన్ని, చిన్న వ్యాపారులను కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ పోరాటం ఎంతో న్యాయమైనదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి మెడికల్ అసోసియేషన్ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ