తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం టేకులపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విధానాన్ని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. వంటగది పరిస్థితులు, వంట తయారీ ప్రక్రియను తనిఖీ చేసి, విద్యార్థులకు అందించే భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ్యం పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని అన్నారు . ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్, అది ఎప్పుడు ఏర్పాటు చేశారో, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు వినియోగంలో లేదో సంబంధిత అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు పాఠశాలలో త్రీఫేస్ విద్యుత్ సరఫరా సమస్య ఉండటంతో ప్లాంట్‌ను ఉపయోగించలేకపోతున్నామని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, తక్షణమే త్రీఫేస్ కరెంట్ సమస్యను పరిష్కరించి ఆర్వో ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం టేకులపల్లి మండలం నంద్యా తండాలోని ఏకలవ్య పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న సదుపాయాలు, మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి రోజువారీ శుభ్రత నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రమైన వాతావరణం అత్యంత అవసరమని , పాఠశాలలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని, సంబంధిత సిబ్బంది క్రమం తప్పకుండా శుభ్రత పనులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం డైనింగ్ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారో లేదో తనిఖీ చేసి, నిర్దేశిత మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులకు వండుతున్న ఆహార పదార్థాలను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. స్టోర్ రూమ్‌లో ఉంచిన కూరగాయలను పరిశీలించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తాజా కూరగాయలను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. కూరగాయలను నేలపై ఉంచడంపై వార్డెన్‌ను ప్రశ్నించి, వెంటనే ర్యాక్‌లు ఏర్పాటు చేసి శుభ్రంగా నిల్వ చేయాలని సూచించారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంతో పాటు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి శ్రీరామ్, తాసిల్దార్ వీరభద్రం, ప్రిన్సిపల్ రవీంద్ర, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ