తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు మేయర్ మూడ్ గణేష్ తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29 డివిజన్లకు త్రాగునీరు సరఫరా చేసే ఇల్లందు క్రాస్ రోడ్డులోని ఫిల్టర్ బెడ్ లోని విద్యుత్ సరఫరా ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఈ విషయం తెలుసుకున్న మేయర్ వెంటనే ఫిల్టర్ బెడ్ ను సందర్శించి పరిస్థితిని సమీక్షించడంతో పాటు, అక్కడ జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మత్తుల చేసి మళ్లీ బిగించేందుకు ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉండటంతో, ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నుంచి తాత్కాలికంగా మరో ట్రాన్స్ఫార్మర్ తెప్పించి, ఇక్కడ బిగించి నీటి సరఫార్మాను పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మరమ్మతులకు గురైన పాత ట్రాన్స్ఫార్మర్ను కూడా త్వరలోనే పూర్తిగా బాగు చేయించి తిరిగి బిగిస్తామని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో నీటి సమస్యలు రాకుండా ఎమ్మెల్యే కూనంనేని కృషితో కొత్తగూడెం కార్పొరేషన్ కు అమృత్ పథకంలో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో నీటి పథకాలు, ఇతర నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని, త్వరలోనే ఈ పథకం పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. మేయర్ వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ