తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యాసంగి 2025-26 ధాన్యం కొనుగోలు పై అదనప కలెక్టర్ వేణుగోపాల్ కార్యాలయంలో శనివారం రైస్ మిల్లర్లు, ఎఫ్సీఐ అధికారులు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, అప్రమత్తతతో నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సుమారు 83,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నాణ్యత ప్రమాణాల ప్రకారం పరిశీలించి, అర్హమైన ధాన్యానికి మాత్రమే కొనుగోలు పత్రాలు, టోకెన్లు జారీ చేయాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు రైతులు తెస్తున్న PR-126 వరి రకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ రకంలో పిన్‌పాయింట్ డ్యామేజ్ సమస్య కారణంగా ఎఫ్‌సీఐ వద్ద బియ్యం ఆమోదం పొందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలియజేశారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సమన్వయం చేసుకొని ఎఫ్‌సీఐ వద్ద బియ్యం సజావుగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న సంస్థలు రైతులకు తగిన సౌకర్యాలు కల్పించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉన్న నేపథ్యంలో రైతులు ఎండల సమయంలో కేంద్రాలకు రాకుండా, వాతావరణం చల్లబడిన తర్వాత ధాన్యాన్ని తీసుకురావాలని అవగాహన కల్పించాలని అన్నారు.రైస్ మిల్లర్లు తమ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతికి అవసరమైన హమాలీలు, గోదాం స్థలాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు వరి కొనుగోలు సిబ్బందికి శిక్షణ అందించి, సమన్వయంతో పని చేస్తూ కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ విద్య చందన, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ. ప్రేమ్ కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి త్రినాధ్ బాబు, జిల్లా సహకార అధికారి రాజశేఖర్, ఎఫ్‌సీఐ అధికారులు వెంకట రమణ, పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ