తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనలతో కలిసి కలెక్టర్ ప్రజల వినతులను స్వయంగా స్వీకరించారు.జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు:1. అశ్వాపురం మండలం వేములూరు గ్రామానికి చెందిన కొమరం నాగమణి తనకు ఇంటి స్థలం ఉన్నప్పటికీ ఇల్లు లేదని, ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తనకు ఇల్లు ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. అందువల్ల తన పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.2. ఇల్లందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన సుశీల తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలనలో భాగంగా గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి లబ్ధి అందలేదని తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించగా “Not Applied”గా చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ దరఖాస్తును పరిశీలించి తగు చర్యల కోసం ఇల్లందు ఎంపీడీవోకు కలెక్టర్ ఎండార్స్ చేశారు.3. బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన మాదాబత్తుల రమణ ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసి 77 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నానని, కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. జీవనోపాధి కోసం దివ్యాంగుల స్కూటీ మంజూరు చేయాలని కోరగా, దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. 4. పాల్వంచకు చెందిన కోలా శ్రీను తన కుమారుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ 13–02–2026న అనారోగ్యంతో మరణించాడని తెలిపారు. వయోవృద్ధులైన తల్లిదండ్రులుగా కుటుంబ పోషణ భారంగా మారిందని, తన కుమారుడికి సంబంధించిన బకాయి వేతనాలు తమకు అందించడంతో పాటు తమపై ఆధారపడిన కుమార్తెకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దీనిపై తగు చర్యల కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి కలెక్టర్ ఎండార్స్ చేశారు. 5. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన బిటియా ఏసు తన తండ్రి అనారోగ్య కారణాలతో 2021లో మరణించారని, ఆ సమయంలో మరణ ధ్రువీకరణ పత్రం పొందలేకపోయామని తెలిపారు. ఇటీవల మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సమస్య ఎదురవుతోందని పేర్కొన్నారు. ఈ దరఖాస్తును పరిశీలించి తగు చర్యల కోసం భద్రాచలం సబ్ కలెక్టర్‌కు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ