తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ పట్టణంలోని బోలోరిగూడెం ప్రాంతంలో ఉన్న వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, ఆహారం, వసతి పరిస్థితులు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా వసతి గృహంలోని స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసి, అక్కడ నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర ఆహార పదార్థాల నిల్వలను పరిశీలించారు. సరుకుల నాణ్యత, నిల్వ విధానం, స్టాక్ రిజిస్టర్ వివరాలను పరిశీలించి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.అలాగే వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, వంటశాల నిర్వహణ, పరిశుభ్రత పరిస్థితులను కూడా పరిశీలించారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన, పోషకాహారం పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వసతి గృహంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన వసతి, పోషకాహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వసతి గృహాల నిర్వహణను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ తనిఖీలో తాసిల్దార్ ధారా ప్రసాద్,సంబంధిత శాఖల అధికారులు, వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ