తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : సమాజంలో జర్నలిస్టుగా పనిచేయడం ఎంతో అదృష్టం సీనియర్ జర్నలిస్ట్ మోటమర్రి రామకృష్ణ ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న పత్రికా రంగంలో జర్నలిస్టుగా పనిచేయడం ఎంతో అదృష్టమని సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ పేర్కొన్నారు. 1984 డిసెంబర్ లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో అడుగుపెట్టి తాను క్రమీణ కొత్తగూడెం 1990 మార్చిలో రావడం జరిగింది. వివిధ పత్రికలలో జర్నలిస్టుగా పనిచేసిన తాను 40 వసంతాలు పూర్తిచేసు కోవడం జరిగింది. పాత్రికేయ రంగ ఎంతో విశిష్టతను సంతరించుకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయడానికి, సమాజానికి విశేషంగా సేవలందించడానికి ఎంతో బాధ్యతాయుతమైన పాత్రికేయ వృత్తి గొప్ప అవకాశాన్నిస్తుందని ఆయన అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే జర్నలిస్టుగా పనిచేసే అవకాశం తనకు లభించిందని ఆయన హర్షం వ్యక్తం చేసారు. జీవితంలో ఒక ఉత్తమ జర్నలిస్ట్గా రాణించాలనే తన ఆశయం దైవానుగ్రహంవల్ల నేలకొండపల్లి, ఖమ్మంల తో పాటు కొత్తగూడెంలోనే నెరవేరిందని, తన పాత్రికేయ ప్రస్థానంలో సదురు మూడు ప్రదేశాలు ఒక మైలురాయిగా నిలుస్తాయని అన్నారు. ఉదయం, ఆంధ్రప్రభ, వార్త, జనతా, విశాలాంధ్ర, సూర్య పత్రికల్లో పనిచేయడం జరిగిందన్నారు. తొలుత ఉదయం దినపత్రికతో తన పాత్రికేయ వృత్తి ప్రారంభమైనదని, ఆయా దినపత్రికలు తనను ఒక మంచి జర్నలిస్ట్గా తీర్చిదిద్దాయని, ఈ విషయం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. వృత్తిలో ఎంతోమంది ప్రతిభావంతులైన జర్నలిస్టులతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని, వృత్తిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ, అంకితభావంతో విధులను నిర్వర్తించి ప్రజల ఆదరణ పొందటం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం సమాజంలో జర్నలిస్టులు చాలా తక్కువమంది వుండేవారని, జర్నలిస్టులపట్ల ప్రజలకు ప్రత్యేక గౌరవం వుండేదని, అప్పట్లో జర్నలిస్టునని చెప్పుకోవడం గర్వకారణంగా వుండేదని అన్నారు. గతంలో జర్నలిస్టుగా పనిచేయాలనే ఆసక్తి చాలామందికి వుండేదని, కానీ సమకాలీన సామాజిక పరిస్థితులపట్ల చక్కటి అవగాహన, భాషాపరిజ్ఞానం, వృత్తిపట్ల అంకితభావం కలవారు మాత్రమే అప్పట్లో జర్నలిస్టులుగా ఎంపికయ్యేవారని ఆయన స్పష్టం చేసారు. నేడు పత్రికా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం విశేషంగా అభివృద్ధి చెందిందని, ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా జర్నలిస్టులు వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తుంటారని అన్నారు. కాలానుగుణంగా దినదినాభివృద్ధి చెందుతున్న పత్రికా రంగంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ అంకితభావంతో విధులను నిర్వర్తించి వృత్తి గౌరవాన్ని పెంచవలసిన బాధ్యత జర్నలిస్టులపై వుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర విశిష్టమైనదని, వార్తల రూపంలో వాస్తవాలను ప్రజలకు అందజేస్తున్న జర్నలిస్టులు అభినందనీయులని ప్రశంసించారు. ఆదర్శవంతమైన ఆశయాలతో తమ విశేష ప్రతిభా పాటవాలతో పాత్రికేయ రంగానికి బంగారు బాటలు వేసిన జర్నలిస్టులను తలుచుకుంటే ఎంతో ధైర్యం, స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. పాత్రికేయ రంగం విశేషంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో పనిచేసిన జర్నలిస్టులు తమ లక్ష్యసాధనలో సఫలీకృతులయ్యారని అన్నారు. సమాజసేవలో జర్నలిస్టుగా తాను నిజమైన సంతృప్తిని పొందానని ఆయన అన్నారు. సమాజంలో వృత్తినే దైవంగా భావించి సంవత్సరాల తరబడి పత్రికా రంగంలో విశేష సేవలందించిన జర్నలిస్టులను గుర్తించవలసిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. జర్నలిజం ఒక మహాసముద్రమని, ఈ రంగంలో ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసినది వుంటూనే వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో మీడియా రంగం ఉజ్వలమైన భవిష్యత్తును కలిగి వుండాలని, జర్నలిస్టులకు ఎంతో మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ