తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సంస్థను స్తంభింపజేసే స్థాయిలో ఆందోళనలు చేపడతామని, ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు సిద్ధంగా ఉండాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటీయూసీ) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య హెచ్చరించారు. సోమవారం పీవీకే-5 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, కార్మికుల సహనాన్ని యాజమాన్యం బలహీనతగా భావించవద్దన్నారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డు కేసులు, అలియాస్ పేర్ల మార్పులు, పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ తొలగింపు, సొంత ఇంటి స్థలాల కేటాయింపు, డిపెండెంట్ ఉద్యోగాలు వంటి సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు నియామక ఉత్తర్వులు జారీ కావడం ఎఐటీయూసీ పోరాట ఫలితమేనని పేర్కొన్న ఆయన, కార్మికులు ఐక్యంగా ఉంటే మరిన్ని సమస్యలకు పరిష్కారం సాధించవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొత్త కోల్ బ్లాకుల కేటాయింపు, కొత్త గనుల ప్రారంభం, సంస్థ విస్తరణతో పాటు భవిష్యత్ తరాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. యూనియన్‌తో జరిగిన సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లు అమలు కాకపోవడానికి రాజకీయ జోక్యమే కారణమని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం మొండివైఖరి కొనసాగిస్తే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతాయని, అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోమని మిరియాల రంగయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, ఉపాధ్యక్షులతోపాటు కత్తెర్ల రాములు, సహాయ కార్యదర్శి గట్టయ్యతో పాటు పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ